Telugu Global
Andhra Pradesh

థియేటర్ ధ్వంసం.. పవన్ అభిమానులపై కేసు నమోదు

రెచ్చిపోయి అల్లరి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని థియేటర్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై ఫ్యాన్స్ దాడి చేసినట్లు థియేటర్ నిర్వాహకులు ఆరోపించారు.

థియేటర్ ధ్వంసం.. పవన్ అభిమానులపై కేసు నమోదు
X

తొలిప్రేమ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌ను ధ్వంసం చేసిన కేసులో పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా విడుదలై 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాను శుక్రవారం రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ నగరం గాంధీ నగర్‌లో ఉన్న కపర్థి థియేటర్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు.

అయితే శుక్రవారం రాత్రి సెకండ్ షో ప్రారంభమైన కొద్దిసేపటికి కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లో టపాసులు పేల్చారు. స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. ఆ సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ స్క్రీన్ ను చించివేసే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన థియేటర్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు, థియేటర్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

రెచ్చిపోయి అల్లరి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని థియేటర్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై ఫ్యాన్స్ దాడి చేసినట్లు థియేటర్ నిర్వాహకులు ఆరోపించారు. అంతేకాక స్క్రీన్ ను చించివేశారని, కుర్చీలు, తలుపులను విరగ్గొట్టడమే కాక.. థియేటర్ అద్దాలను పగులగొట్టినట్లు వారు చెప్పారు.

సినిమాకు వచ్చిన వ్యక్తులు థియేటర్‌లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షల ఆస్తి నష్టం కలిగించినట్లు థియేటర్ మేనేజర్ మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసుకుని శనివారం ఏడుగురు పవన్ కళ్యాణ్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించేందుకు మూడు బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

కాగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయి ప్రవర్తించి థియేటర్ ను ధ్వంసం చేశారని నిర్వాహకులు ఆరోపిస్తుండగా.. పవన్ అభిమానులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్లోకి వచ్చి కావాలనే రచ్చ చేశారని, ఇందులో రాజకీయ కోణం ఉందని వారు అంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ విషయంలో నిజానిజాలు తేల్చాల్సి ఉంది.

First Published:  2 July 2023 5:17 AM GMT
Next Story