విషాదం నింపిన విహారయాత్ర.. - ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. మరో ఇద్దరు గల్లంతు
ఇంజినీరింగ్ విద్యార్థుల విహార యాత్ర విషాదాన్ని నింపింది. తిరుగు ప్రయాణంలో వీరి కారు కాలువలోకి దూసుకుపోయి ఒక విద్యార్థి మృతిచెందాడు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లికి శనివారం విహార యాత్రకు వెళ్లారు. తమతో పాటు డ్రైవర్‌ని తీసుకెళ్లారు. రెండు కార్లలో వీరంతా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె అనే పర్యాటక ప్రాంతానికి చేరుకున్నారు.
తిరుగు ప్రయాణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలోని రెండు వంతెనల మధ్య నుంచి ఓ కారు నేరుగా కాలువలోకి దూసుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని కారును బయటికి తీశారు. ఈ ఘటనలో ఉదయ్ అనే విద్యార్థి తీవ్ర గాయాలతో కారులోనే మృతిచెంది ఉన్నాడు. హరీశ్, హేమంత్ అనే విద్యార్థులు గల్లంతయ్యారు. అదే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. చీకటిగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, ఆదివారం ఉదయం గాలింపు చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు.