Telugu Global
Andhra Pradesh

గుడివాడలో అభ్యర్థే దొరకటంలేదా?

కొడాలిని ఓడించే విషయాన్ని పక్కనపెట్టేస్తే నాలుగేళ్ళల్లో చంద్రబాబు అభ్యర్థినే ఎంపికచేయలేకపోయారు. సీనియర్ల‌ను కాదని డబ్బుందన్న కార‌ణంగా ఎన్ఆర్ఐకి టికెట్ కేటాయిస్తే తమ్ముళ్ళు సహకరిస్తారా? గడచిన రెండు ఎన్నికల్లో కొడాలి గెలుపున‌కు టీడీపీ నేతల లోపాయి సహకారం కూడా ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

గుడివాడలో అభ్యర్థే దొరకటంలేదా?
X

రాబోయే ఎన్నికల్లో గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించాలన్నది చంద్రబాబు నాయుడు టార్గెట్. టార్గెట్ అయితే పెట్టుకున్నారు కానీ అందుకు తగ్గ గట్టి అభ్యర్థి అయితే దొరకటంలేదు. చాలా సంవత్సరాలుగా పార్టీలోనే ఉంటూ, గతంలో పోటీచేసి ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావుతోనే పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఆమధ్య అనుకున్నారు. అయితే ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము తెరపైకి రావటంతో చంద్రబాబు ఆలోచనలు మారిపోయాయట.

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వెనిగండ్లనే గుడివాడలో అభ్యర్థిగా ప్రకటించాలని ఆల్ మోస్ట్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. మధ్యలో మరో యువనేత శిష్ట్లా రోహిత్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే తొందరలోనే చంద్రబాబు గుడివాడలో పర్యటించబోతున్నారు. దీనికి సన్నాహక సమావేశం జరిగింది. ఇన్‌చార్జి కొనకళ్ళ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి వెనిగండ్లకు పిలుపు రాలేదు. కీలకమైన సమావేశం పెట్టుకుని తనను పిలవకపోవటంపై రాముకు మండిందంట‌.

తనను పిలవని విషయమై వెనిగండ్ల సీనియర్లతో ప్రస్తావిస్తే కొనకళ్ళని అడగమని తప్పించుకున్నారట. దాంతో ఇదే విషయంపై వెనిగండ్ల బాగా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే వెనిగండ్లను చంద్రబాబు ఎంటర్‌టైన్ చేయటం పార్టీలోని చాలామందికి ఏమాత్రం రుచించటంలేదని తెలిసింది. కారణం ఏమిటంటే దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకునున్న రావిని చంద్రబాబు పక్కనపెట్టేయటమే. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నవాళ్ళని చివరి నిమిషంలో పక్కనపెట్టేసి డబ్బున్నదన్న కారణంగా ఇంకోరికి టికెట్ ఇస్తే ఎలాగన్నది సీనియర్ల ప్రశ్న.

కొడాలిని ఓడించే విషయాన్ని పక్కనపెట్టేస్తే నాలుగేళ్ళల్లో చంద్రబాబు అభ్యర్థినే ఎంపికచేయలేకపోయారు. సీనియర్ల‌ను కాదని డబ్బుందన్న కార‌ణంగా ఎన్ఆర్ఐకి టికెట్ కేటాయిస్తే తమ్ముళ్ళు సహకరిస్తారా? గడచిన రెండు ఎన్నికల్లో కొడాలి గెలుపున‌కు టీడీపీ నేతల లోపాయి సహకారం కూడా ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే గట్టి అభ్యర్థిని ఎంపికచేసి ప్రకటించాల్సిన చంద్రబాబు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాగైతే అభ్యర్థిని ప్రకటించేదెప్పుడు, ఆ అభ్యర్థి కొడాలిని ఓడించేదెప్పుడు?

First Published:  9 April 2023 12:18 PM IST
Next Story