Telugu Global
Andhra Pradesh

ఎస్కే వర్సిటీలో లా కోర్సు ఎత్తివేత వివాదాస్పదం

న్యాయశాస్త్రానికి సంబంధించి ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్ పుల్లారెడ్డి కూడా మెడికల్ లీవ్‌ పెట్టేశారని లేఖలో వివరించారు. కాబట్టి కోర్సును ఎత్తివేయాలని ప్రతిపాదించారు.

ఎస్కే వర్సిటీలో లా కోర్సు ఎత్తివేత వివాదాస్పదం
X

అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్శిటీలో న్యాయశాస్త్ర కోర్సును ఎత్తివేయాలన్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వర్సిటీలో లా కోర్సు బోధించేందుకు అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరని కాబట్టి 2022-23 ఏడాది నుంచి లా కోర్సును నిర్వహించడం సాధ్యం కాదని.. కాబట్టి అడ్మిషన్లు నిలిపివేయాలంటూ ఉన్నత విద్యామండలికి వర్సిటీ ఉన్నతాధికారులు లేఖ రాశారు.

న్యాయశాస్త్రానికి సంబంధించి ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్ పుల్లారెడ్డి కూడా మెడికల్ లీవ్‌ పెట్టేశారని లేఖలో వివరించారు. కాబట్టి కోర్సును ఎత్తివేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై విద్యార్థులు మండిపడుతున్నారు. వర్సిటీలో భోజనం, మౌలిక సదుపాయాల్లో లోపాలను ప్రశ్నించే వారిలో లా విద్యార్థులే ముందుంటున్నారని.. అలా ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఏకంగా కోర్సును ఎత్తివేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

చాలా కోర్సులకు కూడా ప్రొఫెసర్ల కొరత ఉందని.. వాటి జోలికి వెళ్లకుండా లా కోర్సు మాత్రమే ఎత్తివేయడం వెనుక ఉద్దేశం అదేనని విమర్శిస్తున్నారు. వర్సిటీలో లా కోర్సుకు ఫీజు 5వేలు మాత్రమే. హాస్టల్ వసతీ ఉంది. అదే బయట చదవాలంటే కోర్సు ఫీజు 25వేలు అవుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ వివాదం ఆధారంగా టీడీపీ రాజకీయ కోణంలో విమర్శలకు దిగింది. ఉన్న లాకోర్సును నిర్వహించడం చేతగాదు కానీ.. రాయలసీమకు న్యాయ రాజధాని తెస్తారా..? అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్ విమర్శించారు. ఈ పరిస్థితిని చూసి రాయలసీమ మంత్రులు సిగ్గుపడాలన్నారు.

First Published:  6 Dec 2022 8:01 AM IST
Next Story