జగన్‌ను ఎల్లోమీడియా అడ్డుకోగలదా..?
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోర్టు పనులు, మొదలైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ నిర్మాణం గురించి మాట్లాడదు.
ఉత్తరాంధ్రలోకి జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టకూడదన్నది ఎల్లోమీడియా బలమైన కోరిక. అయితే జగన్ ఎంట్రీని అడ్డుకునేంత సీన్ లేదు. అందుకనే జగన్ ఎప్పుడు ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నా బోరుమని ఏడుస్తుంటుంది. తాజాగా ‘విశోకపట్నం’ అనే హెడ్డింగుతో బ్యానర్ స్టోరీ అచ్చేసింది. అందులో పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని వెళ్ళగొట్టారని గోలచేసింది. ఐటీ రంగాన్ని కుంగదీశారట. పర్యాటకాన్ని కుంగదీశారట. మెట్రో ప్రాజెక్టును అటకెక్కించినట్లు ఆరోపించింది. ఇక్కడకి వచ్చి ఏం ఉద్ధరిస్తారు జగన్..? అంటూ ప్రశ్నించింది.
భీమిలీలో జగన్ శనివారం సాయంత్రం ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. బహిరంగసభను గ్రాండ్ సక్సెస్ చేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం ఖాయం, బహిరంగసభ సక్సెస్ అవటం ఖాయమన్నదే ఎల్లోమీడియా ఏడుపు. పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని జగన్ ఎప్పుడు వెళ్ళగొట్టారో చెప్పరు. గడచిన ఐదేళ్ళల్లో విశాఖలో కొలువుదీరిన ఐటీ పరిశ్రమలు కనబడుతున్నా ఏమీ రాలేదనే చెబుతారు. విప్రో, ఇన్ఫోసిస్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోర్టు పనులు, మొదలైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ నిర్మాణం గురించి మాట్లాడదు. ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారంలో భాగంగా ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, ఇంటింటికి మంచినీటి సౌకర్యం, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు ఎల్లోమీడియాకు కనబడదు. అదానీ డేటా సెంటర్ పనులు జరుగుతున్న విషయం ఎల్లోమీడియాకు తెలీదా..? అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ లో వచ్చిన పరిశ్రమలు ఎల్లోమీడియాకు కనబడదు. ఒకప్పుడు విశాఖపట్టణాన్ని డెవలప్ చేసి ఉత్తరాంధ్రను ఉద్ధరించామని చెప్పుకునే వారు.
కానీ, ఉత్తరాంధ్ర డెవలప్ అంటే విశాఖ డెవలప్మెంట్ మాత్రమే కాదని జగన్ నిరూపిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధిపైన కూడా దృష్టిపెట్టారు. ఏరకంగా చూసినా చంద్రబాబునాయుడు పాలనలో కన్నా, జగన్ పాలనలోనే ఉత్తరాంధ్ర డెవలప్ అవుతోంది. ఇప్పుడు ఎల్లోమీడియా ఏడుపు ఏమిటంటే.. వచ్చేఎన్నికల్లో జగన్ గెలిస్తే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తాడని బాగా తెలుసు. రాజధానిగా అమరావతే ఉండాలన్నది ఎల్లోమీడియా బలమైన కోరిక. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ పైన బురదజల్లుడు రాతలు రాసి బోరుమంటోంది.