క్లీన్ స్వీప్ సాధ్యమేనా..?
టార్గెట్లు ఫిక్స్ చేసుకోవటం ఏముంది అది జగన్ చేతిలోని పని. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా..? అన్నదే పాయింట్.
వచ్చే ఎన్నికల్లో రాయలసీమ సీట్లను క్లీన్ స్వీప్ చేయాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు గట్టిగా చెప్పారు. రాయలసీమలో పార్టీ పరిస్ధితితో పాటు టీడీపీ బలాలు, బలహీనతలు, గట్టి అభ్యర్థులెవరు, నేతలెవరు అనే విషయాలపై రాయలసీమకు చెందిన కొందరు కీలకనేతలతో ఆదివారం సమీక్షించారు. తాను తెప్పించుకుంటున్న సర్వేల వివరాలను కూడా నేతలకు జగన్ వివరించారట. ఈ సందర్భంగా జగన్ రాయలసీమలోని 52కి 52 సీట్లను వైసీపీనే గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేశారు.
టార్గెట్లు ఫిక్స్ చేసుకోవటం ఏముంది అది జగన్ చేతిలోని పని. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా..? అన్నదే పాయింట్. 2014 ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో వైసీపీకి 34 సీట్లొచ్చాయి. 2019 ఎన్నికల్లో 49 సీట్లలో వైసీపీ గెలిచింది. 52 సీట్లలో ఒకేపార్టీ 49 సీట్లను గెలవటం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. అయితే అలాంటి అరుదైన ఫీట్ మళ్ళీ మళ్ళీ సాధించటం సాధ్యమేనా ? ఎందుకంటే వైసీపీ మీద జనాల్లో అసంతృప్తి పెరిగిందన్నది వాస్తవం.
ఇదే సమయంలో మంత్రులు, లేదా ఎమ్మెల్యేలు, ఎంపీల వైఖరిపైన కూడా కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెరిగింది. అయితే జనాల్లో పెరిగిన అసంతృప్తి లేదా వ్యతిరేకత టీడీపీకి ప్లస్సవుతుందా అంటే అవుతుందని చెప్పేందుకు లేదు. ఎందుకంటే టీడీపీ పుంజుకున్నట్లు ఎక్కడా కనబడటంలేదు. జగన్ అయితే 52కి 52 సీట్లూ గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పంలో చంద్రబాబును ఓడించటం అంత ఈజీ అయితే కాదు. అలాగే పార్టీ పెట్టిందగ్గర నుండి అనంతపురం జిల్లా, హిందుపురం అసెంబ్లీలో టీడీపీకి ఇప్పటివరకు ఓటమన్నదే లేదు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరిపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి పార్టీపై జనాల్లో వ్యతిరేకతను తగ్గించుకుని, తప్పదని అనుకున్న సిట్టింగులను మార్చేసి, కుప్పం, హిందుపురంలో కూడా పార్టీకి గెలిచేంత సీనుంటేనే జగన్ టార్గెట్ రీచవుతారు. లేకపోతే రివర్సులో వైసీపీకి సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. చూద్దాం మరి చివరకు ఏమవుతుందో..