అక్క, చెల్లెళ్లే పోటీచేయొచ్చు కదా..?
తన తండ్రి హత్యలో అవినాష్ పాత్రకూడా ఉందని సునీత పదేపదే ఆరోపిస్తున్నారు. అవినాష్ ను అరెస్టు చేయించేందుకు సునీత చాలా ప్రయత్నాలు చేశారు. కాబట్టి అవినాష్ మీద ఎంపీగా సునీతే పోటీచేస్తేనే బెటర్.
జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కా చెల్లెళ్ళు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత భేటీ అయ్యారు. దాదాపు మూడుగంటల పాటు ఇడుపులపాయలోని ఎస్టేట్ లో వీళ్ళభేటీ జరిగింది. ఈ భేటీలో వీళ్ళు ఏమి డిసైడ్ చేశారంటే రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కథేంటో చూడాలని. ఏ విధంగా అంటే కడప పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టి అభ్యర్థులను పోటీలోకి దించటం ద్వారా. ఎంపీగా వైసీపీ తరఫున అవినాష్ రెడ్డే పోటీచేస్తారు. పులివెందులలో జగన్ పోటీ ఖాయం.
కాబట్టి వీళ్ళిద్దరిపైనా గట్టి అభ్యర్థులను పోటీకి దింపాలన్నది భేటీలో తీసుకున్న నిర్ణయం. అయితే అంత గట్టి అభ్యర్థులు వీళ్ళకు ఎక్కడ దొరుకుతారు..? హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేయించాలని అనుకున్నారట. మరి పులివెందులలో జగన్ కు వ్యతిరేకంగా ఎవరిని పోటీలోకి దింపాలి. ఇదే పెద్ద సమస్యగా మారింది. పార్లమెంటుకు సౌభాగ్యమ్మను, పులివెందులకు మరో అభ్యర్థిని వెతుక్కునే బదులు అసలు అక్క, చెల్లెళ్ళే పోటీచేయచ్చుకదా..?
తన తండ్రి హత్యలో అవినాష్ పాత్రకూడా ఉందని సునీత పదేపదే ఆరోపిస్తున్నారు. అవినాష్ ను అరెస్టు చేయించేందుకు సునీత చాలా ప్రయత్నాలు చేశారు. కాబట్టి అవినాష్ మీద ఎంపీగా సునీతే పోటీచేస్తేనే బెటర్. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తన తల్లి సౌభాగ్యమ్మను పోటీలోకి దింపటం అనవసరం కదా..? అవినాష్ మీద సునీత పోటీచేస్తేనే బాగుంటుంది. అలాగే ఏవో గట్టుతగాదాల కారణంగా జగన్ తో గొడవలు పెట్టుకుని కసితీరా నోటికొచ్చింది మాట్లాడుతూ ప్రతిరోజు బురదచల్లేస్తున్నారు షర్మిల.
కాబట్టి పులివెందులలో జగన్ మీద పోటీచేయటానికి షర్మిలకన్నా గట్టిక్యాండిడేట్ ఇంకెవరుంటారు. వైసీపీ తరఫున అన్నా, తమ్ముళ్ళ మీద ప్రత్యర్థులుగా అక్కా, చెల్లెళ్ళు పోటీచేస్తేనే బాగుంటుంది. అన్నా, తమ్ముళ్ళని ఓడించాలనే కసి అక్క, చెల్లెళ్ళకన్నా ఇంకెవరికుంటుంది..? జగన్, అవినాష్ ను ఓడించాలన్నంత కసి వీళ్ళకు ఉన్నంతగా బయట వ్యక్తులకు ఉంటుందని గ్యారంటీ ఏమీలేదు. పైగా వీళ్ళిద్దరే పోటీలో ఉంటే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కూడా మద్దతిస్తారేమో..? పోటీచేసే విషయాన్ని అక్కా, చెల్లెళ్ళు ఆలోచించకూడదూ.