పవన్‌కు సూటి ప్రశ్న
చాలా పార్టీల్లో వివిధ అనుబంధ సంఘాలు, నేతలు పదవుల్లో ఉంటారు. కానీ జనసేనలో మాత్రం అలాంటిదేమీ కనబడటంలేదు. ప్రధాన కార్యదర్శి పదవిలో తన సోదరుడిని కాకుండా మరో బీసీనో లేకపోతే వేరే సామాజిక వర్గానికి చెందిన నేతను ఎందుకు నియమించలేదో పవన్ సమాధానం చెప్పగలరా?
వారాహి యాత్ర మొదలైన దగ్గర నుండి జనసేన అధినేత రెండే అంశాలను ప్రస్తావిస్తున్నారు. మొదటిదేమో జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవటం. రెండో అంశం ఏమిటంటే కులాల గురించి మాట్లాడటం. నిజానికి ఇప్పుడు ప్రతి పార్టీ సోషల్ ఇంజనీరింగ్ అనే ముద్దుపేరు పెట్టుకునే కుల రాజకీయాలే చేస్తోంది. ఎప్పుడంటే పదవులు ఇచ్చేటప్పుడు, పథకాల ప్రారంభంలో లేదా ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు సమయంలో మాత్రమే. అయితే పవన్ మాత్రం దీన్ని పట్టించుకోకుండా పదేపదే కులాల ప్రస్తావనతో యాత్రను కంపు చేసుకుంటున్నారు.
ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ యాత్ర మొదలుపెట్టిందే కాపులను వైసీపీకి దూరం చేయటం కోసమే అనే విషయం అర్థమైపోతోంది. కాపులను మాత్రమే అయితే బాగోదని ముస్లింలతో మాట్లాడుతూ.. వైసీపీకి కాకుండా తనకు ఓట్లేసి మద్దతు తెలపాలని రిక్వెస్టు చేసుకున్నారు. తనకు అన్నీ కులాల ఒకటేనని పదేపదే ప్రకటిస్తున్నారు. ఇక్కడే పవన్ కులాభిమానం బయటపడుతోంది. ఎలాగంటే పార్టీ పెట్టిన పదేళ్ళకు ప్రధాన కార్యదర్శి పదవిని భర్తీ చేశారు. ఎవరితో అంటే తన సోదరుడు నాగబాబుతో.
అంతకుముందు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ అనే పదవిని కమ్మ సామాజిక వర్గానికి నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. ఇది తప్ప రాష్ట్ర కార్యవర్గంలో ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరికీ తెలియదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి బీసీలు, ముస్లింలు, రెడ్లు, క్రిస్టియన్, క్షత్రియ, వైశ్య తదితర సామాజికవర్గాల నేతలను ఎందుకు నియమించలేదు? పార్టీ మొత్తాన్ని అధ్యక్షుడిగా తాను లేదా తన సోదరుడు లేకపోతే నాదెండ్ల మాత్రమే నడపాలా?
తనకు అన్నీ కులాలు సమానమే అన్నప్పుడు పార్టీలో వివిధ కులాలు, మతాలకు చెందిన వ్యక్తులను పదవుల్లో ఎందుకు భర్తీ చేయలేదో పవన్ సమాధానం చెప్పాలి. ఏ పార్టీని తీసుకున్నా అనేక సామాజిక వర్గాలకు చెందిన నేతలు కనబడుతారు. చాలా పార్టీల్లో వివిధ అనుబంధ సంఘాలు, నేతలు పదవుల్లో ఉంటారు. కానీ జనసేనలో మాత్రం అలాంటిదేమీ కనబడటంలేదు. ప్రధాన కార్యదర్శి పదవిలో తన సోదరుడిని కాకుండా మరో బీసీనో లేకపోతే వేరే సామాజిక వర్గానికి చెందిన నేతను ఎందుకు నియమించలేదో పవన్ సమాధానం చెప్పగలరా?