అవంతికి జనసేన చెక్ పెట్టగలదా?
పవన్‌పై ఆరోపణలు, విమర్శలంటే అవంతి అప్పట్లో ముందువరుసలో ఉండేవారు. అందుకనే పవన్ కూడా ఇప్పుడు మాజీ మంత్రిపై టార్గెట్ ఫిక్స్ చేశారు. నియోజకవర్గంలో బలమైన కాపు నేతలను పార్టీలోకి చేర్చుకోవటం, జనాల్లోచొచ్చుకుని వెళ్ళటం ద్వారా అవంతిని ఓడించాలని ప్లాన్ వేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో భీమిలీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ఎలాగైనా చెక్ పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా పట్టుదలగా ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులను ఓడించాలని పవన్ టార్గెట్ పెట్టిన నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయి. అయితే టాప్ ప్రయారీటి నియోజకవర్గాల జాబితాలో భీమిలీ కూడా ఉంది. అవంతి చాలా బలమైన నేతనే చెప్పాలి. ఆర్థికంగానే కాకుండా అంగబలంలో కూడా టాప్. అలాగే కాపు సామాజికవర్గంలో మంచి పట్టున్న నేత.
నేతలకు, కార్యకర్తలతో పాటు మామూలు జనాలకు ఈజీ యాక్సెస్ ఉండే నేత కాబట్టి నియోజకవర్గంలో మంచి పట్టే ఉంది. అందుకనే ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా, టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా గెలిచి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతటి గట్టి నేతను ఓడించాలని పవన్ గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖపట్నం జిల్లాలో భీమిలీపైన ప్రత్యేక దృష్టిపెట్టారు. గ్రామ గ్రామాన పార్టీ నేతలు తిరుగుతు సభ్యత్వాలు చేయిస్తున్నారు. గ్రామ సమావేశాలు పెట్టి పార్టీలోకి జనాలను చేర్చుకుంటున్నారు.
ఇందులో భాగంగానే నియోజకవర్గంలో గట్టి నేతలు అనుకునే వాళ్ళపైన కూడా దృష్టిపెట్టింది. చాలాకాలంగా అవంతికి సన్నిహితులుగా ఉన్న ముగ్గురిని పార్టీలోకి చేర్చుకుంది. చంద్రారావుతో పాటు మరో ఇద్దరు ప్రముఖ వ్యాపారులు జనసేనలో చేరారు. అవంతి గట్టి నేతే కానీ నోటి దరుసున్న వ్యక్తిగా చెప్పుకుంటారు. అక్కడక్కడ ఒకరిద్దరు మహిళలతో సన్నిహితంగా ఉన్న ఆడియోలు బయటపడ్డాయి. దాన్ని ప్రతిపక్షాలు బాగా వైరల్ చేశాయి.
మంత్రిగా ఉన్నపుడు పవన్‌తో పాటు కొందరు నేతలపైన బాగా విరుచుకుపడేవారు. పవన్‌పై ఆరోపణలు, విమర్శలంటే అవంతి అప్పట్లో ముందువరుసలో ఉండేవారు. అందుకనే పవన్ కూడా ఇప్పుడు మాజీ మంత్రిపై టార్గెట్ ఫిక్స్ చేశారు.నియోజకవర్గంలో బలమైన కాపు నేతలను పార్టీలోకి చేర్చుకోవటం, జనాల్లోచొచ్చుకుని వెళ్ళటం ద్వారా అవంతిని ఓడించాలని పవన్ ప్లాన్ వేస్తున్నారు. జనసేనకు టీడీపీతో పొత్తుంటే అవంతిని ఓడించటం తేలికవుతుందని అనుకుంటున్నారట. పొత్తు లేకపోయినా కాపుల ఓట్లను చీల్చటం ద్వారా అయినా మాజీ మంత్రిని ఓడించాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. మరి అవంతిపైన పవన్ టార్గెట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.