పవన్ కల్యాణ్‌పై ‘పిరికి’ ముద్ర.. చంద్రబాబు డ్రామాలో చిత్తు?
ఇప్పటికీ పవన్ కల్యాణ్ సీటు తేలడం లేదు. పోటీకి పవన్ కల్యాణ్ భయపడుతున్నారనే ప్రచారం రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో జనసేన కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పిరికివాడి ముద్ర పడింది. పవన్ కల్యాణ్‌ను చిత్తు చేసే ఉద్దేశంతోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనకు సరైన అసెంబ్లీ సీటు దక్కకుండా వారు ఎత్తులు వేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు తొలి జాబితాలో తాను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించడంతో పాటు తన కుమారుడు నారా లోకేష్, తన బావమరిది బాలకృష్ణ పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. పవన్ కల్యాణ్ తన పార్టీలో నెంబర్-2 నాదెండ్ల మనోహర్ తెనాలిలో పోటీ చేస్తారని చెప్పేశారు. కానీ, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని చెప్పలేకపోయారు.
ఇప్పటికీ పవన్ కల్యాణ్ సీటు తేలడం లేదు. పోటీకి పవన్ కల్యాణ్ భయపడుతున్నారనే ప్రచారం రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో జనసేన కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని తొలుత భావించారు. అయితే, ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌కు విజయావకాశాలు తక్కువగా ఉన్నాయని టీడీపీ సర్వే తేల్చిందని అంటున్నారు. దాంతో ఆయన మనసు పిఠాపురం వైపు మళ్లింది.
అయితే, పిఠాపురంలో టీడీపీ నేత వర్మ ఆయనకు సవాల్‌గా నిలిచారు. తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ విజయావకాశాలు దెబ్బ తింటాయి. పవన్ కల్యాణ్ పోటీ చేద్దామని అనుకుంటున్న సీట్లలో టీడీపీ స్థానిక నేతలు ఎప్పటికప్పుడు అడ్డు పడుతూ వస్తున్నారు. ఇది చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరుగుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మొబైల్ సర్వేలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా, లేదా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి.