సీదిరి అప్పలరాజు అవుట్..? జగన్‌తో భేటీ అందుకేనా..?
మంత్రిగా సీదిరి అప్పలరాజు పనితీరు కంటే నియోజకవర్గంలో ఆయన అనుచరులు, బంధువులు సాగిస్తున్న భూకబ్జాలు-దందాలు వార్తల్లోకెక్కుతున్నాయి.
కేబినెట్ విస్తరణ చేస్తారనే ఊహాగానాల నడుమ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మంత్రి సీదిరి అప్పలరాజు భేటీ కావడం హాట్ హాట్ చర్చలకు దారి తీసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీ కంటే ముందు మీడియా మిత్రులు కూడా మంత్రి సీదిరి అప్పలరాజుని ఇదే విషయమై ప్రశ్నించారు. అదేం లేదంటూనే సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఏ అభ్యంతరం లేదన్నట్టు చెప్పడంతో సీదిరి అప్పలరాజుని కేబినెట్ నుంచి తప్పిస్తారని టాక్ జోరందుకుంది.
మంత్రి సీదిరి అప్పలరాజు అర్జెంటుగా వచ్చి సీఎంని కలవాలని సీఎంవో నుంచి అందిన సమాచారంతో నియోజకవర్గంలో కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకుని వచ్చారు. సీఎంతో భేటీ కూడా ముగిసింది. సీదిరిని మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని చాలా రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. టీడీపీతో గొడవలుండటం సహజమే అయినా, సొంత పార్టీ నేతలతోనూ సీదిరికి విభేదాలుండటం, ఆయన సామాజికవర్గ ప్రతినిధులు కూడా గుర్రుగా ఉండటంతో మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమని అంటున్నారు.
మంత్రిగా సీదిరి అప్పలరాజు పనితీరు కంటే నియోజకవర్గంలో ఆయన అనుచరులు, బంధువులు సాగిస్తున్న భూకబ్జాలు-దందాలు వార్తల్లోకెక్కుతున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం ఆదేశించినా పట్టించుకోలేదని, దీంతోనే వైసీపీ అభ్యర్థి సీతంరాజు ఘోర ఓటమి పాలయ్యారని అధిష్టానం ఆగ్రహంగా ఉంది.
నియోజకవర్గంలో ఓ వైపు టీడీపీతోనూ, మరోవైపు వైసీపీలో అసమ్మతివర్గంతోనూ ఢీ అంటే ఢీ అంటున్నారు మంత్రి. తనపై వచ్చిన భూఆక్రమణలపై స్పందిస్తూ.. తాను గానీ, తన అనుచరులు గానీ ఎక్కడైనా ఒక్క అంగుళం భూమి ఆక్రమించామని నిరూపిస్తే మంత్రి పదవి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఇంతలోనే ముఖ్యమంత్రి నుంచి పిలుపు రావడం, కొత్త మంత్రులని ఏప్రిల్ 3వ తేదీన ప్రమాణస్వీకారం చేయిస్తారనే వార్తలు బయట చక్కర్లు కొట్టడంతో సీదిరి అప్పలరాజుని తప్పించవచ్చనే ప్రచారానికి బలం చేకూరుతోంది.