Telugu Global
Andhra Pradesh

మొన్న విశాల్, నేడు నాగార్జున.. వైసీపీ టికెట్లపై రోజుకో ప్రచారం..

హీరో నాగార్జునకి సీఎం జగన్ కి సత్సంబంధాలున్నాయి. అంత మాత్రాన నాగార్జున రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేం. ఒకవేళ వచ్చినా ప్రచారానికి పరిమితమవుతారేమో కానీ, ఏకంగా విజయవాడ నుంచి ఎంపీ సీటుకి పోటీ చేస్తారని అనుకోలేం.

మొన్న విశాల్, నేడు నాగార్జున.. వైసీపీ టికెట్లపై రోజుకో ప్రచారం..
X

కుప్పంలో చంద్రబాబుకి పోటీగా 2024లో వైసీపీ తరపున హీరో విశాల్ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి వెంటనే వైసీపీ నేతలు ఫుల్ స్టాప్ పెట్టారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేది భరత్ అని కన్ఫామ్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అసలు చంద్రబాబే కుప్పం వదిలి పారిపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు. కుప్పం సంగతి పక్కనపెడితే ఇప్పుడు నాగార్జున పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన్ను ఏకంగా పార్లమెంట్ కి పంపించాలనుకుంటున్నారట. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి నాగార్జున వైసీపీ టికెట్ పై పోటీ చేస్తారనే కథనం ప్రచారంలోకి వచ్చింది. త్వరలో అధికారికంగా నాగార్జున పేరు కూడా ప్రకటిస్తారని అంటున్నారు.

నాగార్జున రాజకీయాల్లోకి వస్తారా..?

హీరో నాగార్జునకి సీఎం జగన్ కి సత్సంబంధాలున్నాయి. అంత మాత్రాన నాగార్జున రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేం. ఒకవేళ వచ్చినా ప్రచారానికి పరిమితమవుతారేమో కానీ, ఏకంగా విజయవాడ నుంచి ఎంపీ సీటుకి పోటీ చేస్తారని అనుకోలేం. అన్నిటికీ మించి వైసీపీలోనే ఫుల్ కాంపిటీషన్ ఉంది. అందులోనూ అది టీడీపీ గెలిచిన సీటు. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో వైసీపీపై రాజధాని ప్రాంతంలో వ్యతిరేకత ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయని అనుకోలేం. ఈ దశలో విజయవాడ సీటుని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరి నాగార్జునతో వైసీపీ ప్రయోగం చేస్తుందా, లేక స్థానికులకు ఆ సీటు అప్పగిస్తుందా అనేది చూడాలి.

2014, 2019 లో వైసీపీ అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్, పొట్లూరి వరప్రసాద్ పోటీ చేశారు. అయితే అనూహ్యంగా రెండుసార్లూ వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. 2019లో విజయవాడలో అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నా ఎంపీ సీటు మాత్రం వైసీపీ ఓడిపోయింది. 2024లో ఎంపీ సీటుని టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అటు బీజేపీ కూడా ఉత్సాహంగా ఉంది. పవన్ కల్యాణ్ కూడా తగ్గేది లేదంటున్నారు. ఈ హడావిడిలో నాగార్జున ఎంట్రీ ఇస్తారా.. లేక వైసీపీ సానుభూతిపరుడిగానే హుందాగా మిగిలిపోతారా అనేది వేచి చూడాలి.

First Published:  7 Sept 2022 7:13 PM IST
Next Story