Telugu Global
Andhra Pradesh

అప్పర్ తుంగను అడ్డుకోకపోతే రాయలసీమ ఎడారే : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని, అప్పర్ తుంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని బైరెడ్డి డిమాండ్ చేశారు.

అప్పర్ తుంగను అడ్డుకోకపోతే రాయలసీమ ఎడారే : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
X

కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్ తుంగ ప్రాజెక్టును అడ్డుకోకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని, ఒక్క చుక్క నీరు కూడా అందదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని.. అసలు సీఎం వైఎస్ జగన్ రాయలసీమను ఏం అభివృద్ధి చేశారో చెప్తారా అని డిమాండ్ చేశారు. ఏపీకి మూడు రాజధానులు అని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ అసలు రాష్ట్రానికి అన్ని రాజధానులు అవసరమే లేదని ప్రజలే చెబుతున్నారని బైరెడ్డి చెప్పారు.

కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని, అప్పర్ తుంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో రాయలసీమకు చెందిన అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. సంగమేశ్వరం వద్ద తీగల వంతెన బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో కూడా తాము చేస్తున్న డిమాండ్లు చర్చకు రావడం సంతోషకరమైన విషయం అని చెప్పారు. సంగమేశ్వరం వద్ద బ్యారేజీ కట్టి దాన్ని పెన్నారుగా పిలిస్తే బాగుంటుందని సూచించారు.

దక్షిణ ఇండియాలో అత్యంత తక్కువ నీటి పారుదల వ్యవస్థ ఉన్న జిల్లాగా చిత్తూరు ఉన్నదనే విషయం రికార్డులు చెబుతున్నాయని అన్నారు. కృష్ణా-పెన్నారు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే చిత్తూరు జిల్లాలో కరువు కూడా తీరుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు కట్టకపోతే మరో సారి ఇలాంటి అవకాశం రాదని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హోస్పేట డ్యామ్‌తో పాటు, బళ్లారి జిల్లాను కూడా పోగొట్టుకున్నామని.. వచ్చిన రాజధాని కూడా మూడేళ్లకే కోల్పోయామని అన్నారు. ఇకపై ఇలా పోగొట్టుకోలేమని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా పెన్నారు ప్రాజెక్టును పూర్తి చేయాలనే డిమాండ్ చేయాలని సూచించారు. రాయలసీమ అంతా గూండాలు, ఫ్యాక్షనిజం అని సినిమాల్లో చూపించి విలువ దిగజార్చారని ఆరోపించారు. మాకు రావల్సిన నీటి కోసమే డిమాండ్ చేస్తున్నామని.. అంతే తప్ప మరెవరి మీదో ఆరోపణలు చేయడం లేదని బైరెడ్డి స్పష్టం చేశారు.

First Published:  5 Feb 2023 2:37 PM GMT
Next Story