Telugu Global
Andhra Pradesh

7 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. 14న నోటిఫికేషన్‌

ఎన్నికల కమిషన్‌ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తంగా జూలై 15 లోపు ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని ఈసీ పేర్కొంది.

7 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. 14న నోటిఫికేషన్‌
X

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉప ఎన్నికల హడావుడి మొదలైంది. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జూన్‌ 14న విడుదల కానుంది. జూలై 10న పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తంగా జూలై 15 లోపు ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని ఈసీ పేర్కొంది.

10 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేల రాజీనామాలు, మరో మూడు చోట్ల ప్రజాప్రతినిధుల మృతితో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో నాలుగు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వాటిలో రాయ్‌గంజ్, రాణాఘాట్‌ దక్షిణ్, బాగ్దా, మానిక్‌ లా ఉన్నాయి. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లోని డెహ్రా, హమీరుర్‌ నాలాగఢ్‌ స్థానాల్లో, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగ్లౌర్‌ స్థానాల్లో, బిహార్‌లోని రూపౌలీ, తమిళనాడులోని విక్రవాండీ, మధ్యప్రదేశ్‌లోని అమర్వాడా, పంజాబ్‌లోని జలంధర్‌ వెస్ట్‌ స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మానిక్‌లా, విక్రవాండీ, మంగ్లౌర్‌ స్థానాల్లో ఎమ్మెల్యేలు మృతి చెందగా.. మిగతాచోట్ల రాజీనామా చేశారు.

ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జూన్‌ 14న విడుదల చేయనున్నారు. నామినేషన్లకు చివరి తేదీ జూన్‌ 21 కాగా, పరిశీలన జూన్‌ 24 వరకు నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు జూన్‌ 26 వరకు ఉంటుంది. పోలింగ్‌ జూలై 10న నిర్వహించనుండగా, ఓట్ల లెక్కింపు జూలై 13న చేపట్టనున్నారు.

First Published:  10 Jun 2024 7:18 PM IST
Next Story