టీడీపీకి బంపర్ లాటరీ తగిలిందా?
పోలింగుకు ముందు వైసీపీ దొంగ ఓట్లు చేర్పించిందని నానా రచ్చ చేసిన చంద్రబాబు మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో గెలవటంతో అసలు ఆ ప్రస్తావనే తేవడం లేదు. జగన్ పాలనపై జనాల తిరుగుబాటు అని.. అధర్మం మీద ధర్మానిదే అంతమ విజయమని ప్రవచనాలు చెబుతున్నారు.
నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి బంపర్ లాటరీ తగిలిందనే చెప్పాలి. ఒక వ్యక్తి షాపింగ్ చేసినపుడు అక్కడ ఒకడు బలవంతంగా లాటరీ టికెట్ అంటకడతాడు. సదరు వ్యక్తికి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ లాటరీ టికెట్ తీసుకుంటాడు. తీరా చూస్తే ఆ టికెట్‌కే బంపర్ లాటరీ తగులుతుంది. ఇష్టం లేకపోయినా టికెట్ కొన్న కారణంగా తగిలిన లాటరీని తనకు వద్దని షాపువాడికే ఇచ్చేస్తాడా? లేకపోతే లాటరీ టికెట్ కొనటం తన తెలివైన పెట్టుబడిగా ప్రచారం చేసుకుంటాడా?
సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు వ్యవహారం కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఎందుకంటే మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో గెలవటంతో తమ్ముళ్ళతో కలిసి రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల రెఫరెండం అంటున్నారు. జగన్ పాలనపై జనాల తిరుగుబాటంటున్నారు. ఉత్తరాంధ్ర జనాలు విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తున్నట్లు నానా రచ్చ చేస్తున్నారు. దొంగ ఓట్ల గురించే ఎక్కడా మాట్లాడటం లేదు. అధర్మం మీద ధర్మానిదే అంతమ విజయమని ప్రవచనాలు చెబుతున్నారు.
విషయం ఏమిటంటే పోలింగుకు ముందు వైసీపీ దొంగ ఓట్లు చేర్పించిందని ఎంత గోల చేశారో అందరు చూసిందే. పోలింగ్ రోజున చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర రచ్చరచ్చ చేశారు. కలెక్టర్లకు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. కోర్టులో కేసులు వేయబోతున్నట్లు చెప్పారు. దొంగ ఓట్లు చేర్పించిన అధికారులపై చర్యలు తప్పవని వార్నింగులిచ్చారు. అంత గోల చేసిన చంద్రబాబు అండ్ కో ఫలితాల తర్వాత అసలు దొంగ ఓట్ల గురించే మాట్లాడటంలేదు.
మూడు స్థానాల్లో గెలవగానే ప్రజల్లో తిరుగుబాటని, జగన్ పాలనపై రెఫరెండమని గోల చేస్తున్నారు. పోలింగ్‌కు ముందు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు రెఫరెండమని ఎక్కడా చెప్పలేదు. ఈ ఎన్నికల్లో అసలు రాజధాని అంశమే ప్రస్తావనకు రాలేదు. కానీ ఉత్తరాంధ్రలో గెలవగానే ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తేలిపోయిందని పదే పదే రెచ్చిపోతున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే పైన చెప్పుకున్న బంపర్ లాటరీ లాగ ఒక్క చోట కూడా గెలుస్తామనే నమ్మకం టీడీపీలో లేదు. అందుకనే దొంగ ఓట్లని నానా గోల చేశారు. మరి గెలిచిన తర్వాత ఎందుకీ విషయం మాట్లాడటం లేదు. ఎన్నికలకు ముందు రెఫరెండమని ఎక్కడా చెప్పని చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రెఫరెండమని గోల మొదలుపెట్టారు. రాజధాని అంశంపై ఎక్కడా మాట్లాడని టీడీపీ ఇప్పుడు ఉత్తరాంధ్ర జనాలు విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తున్నట్లు ఎందుకు చెబుతున్నారు. ఎందుకంటే గెలుపు మీద నమ్మకంలేని టీడీపీ ఊహించని విధంగా మూడు సీట్లలో గెలిచింది కాబట్టే. ఓడిపోయిన తర్వాత చేయాల్సిన గోలకు ప్రిపేరయ్యారు కానీ గెలుస్తామని ఊహించలేదు కాబట్టే.