Telugu Global
Andhra Pradesh

నాకు అన్యాయం చేశారు.. టీడీపీ హైకమాండ్‌ తీరుపై బుద్ధా అసంతృప్తి

సీఐల ట్రాన్స్‌ఫర్ విషయంలోనూ ఎమ్మెల్యేల మాటే నెగ్గిందని, తన మాటను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కనీసం కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించుకోలేకపోతున్నానన్నారు.

నాకు అన్యాయం చేశారు.. టీడీపీ హైకమాండ్‌ తీరుపై బుద్ధా అసంతృప్తి
X

తెలుగుదేశం పార్టీకి కరడుకట్టిన నేత బుద్ధా వెంకన్న.. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. ఎన్నికలకు ముందు కూటమి గెలవకుంటే నాలుక కోసుకుంటా, రక్తంతో గోడపై చంద్రబాబు జిందాబాద్ అంటూ రాసి హాట్‌ టాపిక్‌గా మారారు. ఇంత విధేయత చూపినప్పటికీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధాకు టికెట్ దక్కలేదు. బుద్ధా ఆశించిన విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. పోనీ పార్టీ అధికారంలోకి వచ్చింది.. బుద్ధాకు ఏదైనా పదవి కట్టాబెట్టారా అంటే అది లేదు. దీంతో బుద్ధా వెంకన్న పార్టీ హైకమాండ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బుద్ధా వెంకన్న.. టీడీపీ అధిష్టానం తీరుపై తన మనసులోని మాటలను బయటపెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా తనకు న్యాయం జరగలేదన్నారు. ఎలాంటి పదవి లేకపోవడంతో తన మాట చెల్లడం లేదని, నమ్ముకున్న కార్యకర్తలకు సాయం చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐల ట్రాన్స్‌ఫర్ విషయంలోనూ ఎమ్మెల్యేల మాటే నెగ్గిందని, తన మాటను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కనీసం కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించుకోలేకపోతున్నానన్నారు. చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ దాడికి వెళ్తే తాను అడ్డుగా నిలబడ్డానని, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడు ఎవరైనా వచ్చారా అంటూ నిలదీశారు బుద్ధా వెంకన్న.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనపై 37 కేసులు పెట్టిందన్నారు బుద్ధా. తెలుగుదేశం పార్టీ కోసమే తాను కేసులు పెట్టించుకున్నానన్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా తనకు న్యాయం జరగలేదన్నారు. ఈ మాట ఆవేదనతోనే చెప్తున్నానని.. వ్యతిరేకతతో కాదన్నారు. 2029లో ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని అసెంబ్లీలో అడుగుపెడతానన్నారు. చచ్చిపోయే వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానన్నారు బుద్ధా వెంకన్న.

First Published:  3 Aug 2024 6:58 AM GMT
Next Story