ఏపీలో బీఆర్ఎస్ హవా.. విజయవాడలో వెలిసిన ఫ్లెక్సీలు
BRS Flexi In Andhra Pradesh: బీఆర్ఎస్ పేరు ప్రకటించగానే ఏపీలో కూడా భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. 'జయహో కేసీఆర్' అంటూ విజయవాడలో పలు చోట్ల భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ ఇకపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నది. డిసెంబర్ 9 తెలంగాణ భవన్ వేదికగా ఈసీఐ ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం చేసి అధికారికంగా సంబరాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పేరుతో ఉన్న జెండాను కూడా ఆవిష్కరించారు. దేశంలోని పలు రాష్ట్రాలకు బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. కర్ణాటకలో జేడీఎస్ మద్దతుతో పార్టీ ఎన్నికల బరిలో నిలవనున్నది. ఇక ఏపీ విషయంలో కూడా ప్రత్యేకమైన స్ట్రాటజీని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ పేరు ప్రకటించగానే ఏపీలో కూడా భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. 'జయహో కేసీఆర్' అంటూ విజయవాడలో పలు చోట్ల భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏపీలోకి బీఆర్ఎస్‌ను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు కూడా వీటిని ఆసక్తిగా చూస్తున్నారు. ఏపీలో కేసీఆర్ మార్క్ రాజకీయం ఎలా ఉండబోతోందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. విజయవాడలో బండి రమేశ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో 'దేశ రాజకీయాలలో నూతన శకం భారత రాష్ట్ర సమితి ఆవిర్బావం.. కక్ష రాజకీయాలకు స్వస్తి.. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా' అని రాసుకొచ్చారు.
బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలోని జక్కంపూడి ఇన్నర్ రింగ్‌రోడ్డు హైవే సమీపంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ 800 గజాల స్థలంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేస్తారని చర్చ జరుగుతున్నది. ఈ నెల 18, 19 తేదీల్లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ వచ్చి స్థలాన్ని పరిశీలిస్తారని తెలుస్తోంది. జనవరిలో రాష్ట్రానికి సంబంధించి పార్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక వేళ ఏపీలో రాష్ట్ర కార్యాలయ నిర్మాణం చేపడితే.. శంకుస్థాపనకు కేసీఆర్ వస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావల్సి ఉన్నది.
దేశమంతటా తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తామని కేసీఆర్ అంటున్నారు. ముఖ్యంగా రైతు ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాల్లో తీసుకొని రావల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ, పరిశ్రమల రంగాల్లో కూడా తెలంగాణ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ముందు ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి రైతు పాలసీ, జలవిధానం, ఇండస్ట్రియల్ పాలసీ రూపొందిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో భాగంగా ప్రతీ రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో వెళ్లడం వల్ల ప్రతీ రాష్ట్రంలో పార్టీని పాజిటివ్‌గా రిసీస్ చేసుకుంటారని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh | BRS party's flex boards seen in Vijayawada. Photos of Telangana CM K Chandrashekar Rao & Telangana Min KT Rama Rao also seen on the flex boards.
— ANI (@ANI) December 10, 2022
The flex boards read,"For progress of Andhra Pradesh, a new assurance is KCR. KCR admn is needed across the country" pic.twitter.com/ztjInN5X9R