Telugu Global
Andhra Pradesh

తమ్ముడి ప్రేమకు అక్కకు శిక్ష.. ప్రకాశం జిల్లాలో దారుణం

పోలీసులు వచ్చిన సమయంలో బాధితురాలు.. దాడి చేసిన వారి ఇంట్లో బందీగా ఉంది. వారి చెరనుంచి ఆమెను విడిపించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తమ్ముడి ప్రేమకు అక్కకు శిక్ష.. ప్రకాశం జిల్లాలో దారుణం
X

ప్రకాశం జిల్లాలో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దర్శిలో ఓ ఎస్సీ యువకుడు అగ్ర కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించి తనతో తీసుకెళ్లాడు. ఆ అక్కసుతో ఆ యువకుడి అక్కపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. తమ బిడ్డను తీసుకొచ్చి అప్పగించకపోతే చంపేస్తామని హెచ్చరించారు. అప్పట్లో కేసు నమోదైంది. అయితే బెయిల్ పై విడుదలై వచ్చిన ఆ యువతి కుటుంబ సభ్యులు మళ్లీ సదరు ఎస్సీ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈసారి ఏకంగా ఆ యువకుడి అక్క గొంతు కోశారు. హత్యాయత్నం చేశారు. చివరకు పోలీసులు రావడంతో ఆమె ప్రాణాలు దక్కాయి.

పోలీసులు వచ్చిన సమయంలో బాధితురాలు.. దాడి చేసిన వారి ఇంట్లో బందీగా ఉంది. వారి చెరనుంచి ఆమెను విడిపించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన కుటుంబంపై మరోసారి కేసులు నమోదు చేశారు పోలీసులు. సకాలంలో పోలీసులు రాకపోతే ఆమె మరణించి ఉండేదని అంటున్నారు స్థానికులు.

స్వాతంత్ర దినోత్సం రోజు అర్థరాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దళిత మహిళ, అందులోనూ వితంతువుపై దాడి జరగడం, ఆమెను వివస్త్రను చేసే ప్రయత్నం చేయడం, కళ్లలో కారం కొట్టి, కత్తులతో దాడి చేసి ప్రాణం తీయాలని చూడటంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ స్వయంగా ఈ కేసు వ్యవహారాలను పరిశీలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణం కాగా.. బాధితురాలిపై జరిగిన దాడి అమానవీయం అంటున్నారు స్థానికులు.

First Published:  16 Aug 2023 6:43 AM IST
Next Story