ఆ సైన్స్‌వాడికి బుర్ర లేదు - బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు
కోతికి కోతే పుడుతుంది.. మనిషికి మనిషే పుడుతాడని.. ఆ విషయం తెలియక ఆ సైన్స్‌వాడు కోతి నుంచి మనిషి వచ్చాడని చెబుతున్నాడని వాడికి బుర్ర లేదని అనిల్ విమర్శించారు.
వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పేర్లు ప్రస్తావించకుండానే ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేశారు. విశాఖలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రసంగించిన ఆయన... తమ స్వార్థం కోసం ప్రభుత్వాలిచ్చే పథకాలపై ఆధారపడవద్దని సూచించారు. ఏ ప్రభుత్వమైనా సరే దేవుడి పాలనకు దగ్గరగా ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏ ప్రభుత్వం కూడా దేవుడి రాజ్యానికి దగ్గరగా లేదని విమర్శించారు. దేవుడి రాజ్యంలో ప్రేమ మాత్రమే ఉంటుందన్నారు. పేరు చెప్పకుండానే ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో పుట్టి ఉంటే బాగుండు అన్న భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు.
స్టేజ్ మీద తన ప్రసంగంలో మధ్య మధ్యలో పలు అంశాలను అనిల్ ప్రస్తావించారు. సైన్స్‌ను ఎద్దేవా చేశారు. కోతికి కోతే పుడుతుంది.. మనిషికి మనిషే పుడుతాడని.. ఆ విషయం తెలియక ఆ సైన్స్‌వాడు కోతి నుంచి మనిషి వచ్చాడని చెబుతున్నాడని వాడికి బుర్ర లేదని అనిల్ విమర్శించారు. భారతీయులు భక్తిపరులని... ఈ దేశంలో అనేక మంది దొంగ బాబాలున్నారని విమర్శించారు. వారంతా దొంగ బాబాలు అని తెలిసి కూడా వారిని ఏమీ చేయరని వ్యాఖ్యానించారు. అలాంటి వారు ప్రజలను మోసం చేస్తున్నారని బ్రదర్ అనిల్ విమర్శించారు.