Telugu Global
Andhra Pradesh

జగన్ పర్యటన రోజు ఉత్తరాంధ్రలో కుప్పకూలిన వంతెన

1929లో బ్రిటిష్ వారు నిర్మించిన వంతెన ఇప్పుడు కూలిపోవడం పెద్ద విశేషమేమీ కాదు కానీ.. ఆ వంతెన పాడుబడిపోయిందని స్థానికుల ఎన్నిసార్లు మొత్తుకున్నా పాలకులు పట్టించుకోకపోవడమే పెద్ద విశేషం.

జగన్ పర్యటన రోజు ఉత్తరాంధ్రలో కుప్పకూలిన వంతెన
X

ఈరోజు సీఎం జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఇదే రోజు ఉత్తరాంధ్రలో పురాతన వంతెన కూలిన ఘటన కలకలం రేపింది. ఇచ్చాపురం వద్ద బహుదా నదిపై ఉన్న పురాతన వంతెన ఉన్నట్టుండి కుప్పకూలింది. 70టన్నుల బరువున్న భారీ గ్రానైట్ లారీ బ్రిడ్జ్ పైకి రాగానే వంతెన కూలిపోయినట్టు తెలుస్తోంది. వంతె కూలిపోవడంతో లారీ కూడా కిందపడిపోయింది. నదిలో నీరు లేకపోవడం, ఆ సమయంలో ఇతర వాహనాలేవీ అటు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఏపీలో రోడ్డు వేస్తే ఐదేళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండాలంటూ సీఎం జగన్ ఇటీవల అధికారుల సమీక్షలో చేసిిన వ్యాఖ్యలు మరీ పాతబడిపోకముందే వంతెన కుప్పకూలడం విశేషం. టీడీపీ వాళ్లు ఉత్తరాంధ్రను ఉత్త ఆంధ్ర చేశారు, మా హయాంలో ఉత్తమాంధ్ర అయిపోతోందంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వేడిగా ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. అయితే 1929లో బ్రిటిష్ వారు నిర్మించిన వంతెన ఇప్పుడు కూలిపోవడం పెద్ద విశేషమేమీ కాదు కానీ.. ఆ వంతెన పాడుబడిపోయిందని స్థానికుల ఎన్నిసార్లు మొత్తుకున్నా పాలకులు పట్టించుకోకపోవడమే పెద్ద విశేషం. పోనీ టీడీపీ వాళ్లు పట్టించుకోలేదు సరే, ఉత్తరాంధ్రపై ప్రేమ కురిపిస్తూ ఏకంగా పాలనా రాజధానిని కట్టబెట్టిన వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పాత బ్రిడ్జ్ లపై కొత్త తారు రోడ్లు వేసి సరిపెట్టడమే ఇక్కడ గమనించాల్సిన అంశం.

ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వేస్తారు..? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని నిందించాలా, గత టీడీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టాలా.. లేక అప్పటి కాంగ్రెస్ పాలకుల్ని దోషులుగా చూపెట్టాలా..? నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా, బ్రిటిష్ కాలంనాటి వంతెనలు ఇంకా అక్కడక్కడ ఉపయోగంలోనే ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయం చూపించాలని స్థానికులు మొత్తుకుంటున్నా, పాలకులు కరుణించడంలేదు. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతా జరిగితే తప్పంతా గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీదేనంటూ ఓ వాదన వినపడుతోంది. భారీ వాహనాలు సహజంగా జాతీయ రహదారిపై వెళ్తాయని, కానీ ఈ వాహనం ఇచ్చాపురంలోకి వచ్చే బ్రిడ్జ్ ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఏది ఏమయినా బహుదా వంతెన కుప్పకూలడంతో కనీసం మిగతా పాత బ్రిడ్జ్ ల గురించి అయినా ప్రభుత్వం పట్టించుకుంటుందేమో చూడాలి.

First Published:  3 May 2023 6:04 AM GMT
Next Story