Telugu Global
Andhra Pradesh

నచ్చిన చొక్కా అడిగితే ఇవ్వలేదు.. టవల్‌తోనే స్టేషన్ కెళ్లిన బాలుడు.. తల్లిపై ఫిర్యాదు

బాత్ రూమ్ లో స్నానం చేసి టవల్ తో బయటకొచ్చిన ఆ బాలుడు అలాగే ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. టవల్ మాత్రమే కట్టుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిల్లాడిని చూసిన పోలీసులు ఏమైంది..? అని ఆరా తీశారు.

నచ్చిన చొక్కా అడిగితే ఇవ్వలేదు.. టవల్‌తోనే స్టేషన్ కెళ్లిన బాలుడు.. తల్లిపై ఫిర్యాదు
X

సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి మదర్స్ డే హంగామా నడుస్తోంది. చాలామంది పిల్లలు తమ తల్లుల ఫొటోలను స్టేటస్ గా పెట్టుకున్నారు. మరికొందరు తల్లితో కలిసి రీల్స్ చేసుకుని, ఫొటోలు దిగి అందరితో పంచుకున్నారు. అంతటా ఈ పరిస్థితి ఉంటే పదేళ్లు కూడా నిండని ఓ బాలుడు నచ్చిన చొక్కా వేసుకుంటానని అడిగితే.. అమ్మ ఇవ్వలేదు.. అంటూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసులవంతైంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరుకు చెందిన బాలుడు తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లేందుకు స్నానం చేసి రెడీ అవుతున్నాడు. తనకు బాగా నచ్చిన తెల్లచొక్కా వేసుకొని వెళ్లాలనుకున్నాడు. ఆ చొక్కా తీసివ్వాలని అమ్మను అడిగితే ఆమె ఇవ్వలేదు. దీంతో ఆ బాలుడికి చిర్రెత్తుకొచ్చింది.

బాత్ రూమ్ లో స్నానం చేసి టవల్ తో బయటకొచ్చిన ఆ బాలుడు అలాగే ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. టవల్ మాత్రమే కట్టుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిల్లాడిని చూసిన పోలీసులు ఏమైంది..? అని ఆరా తీశారు. అప్పుడు ఆ బాలుడు.. ఇవాళ నా స్నేహితుడి పుట్టినరోజు.. నాకు నచ్చిన తెల్లచొక్కా వేసుకొని పార్టీకి వెళ్దామనుకుంటే అమ్మ ఇవ్వలేదు.. అని ఫిర్యాదు చేశాడు. ఇంత చిన్న విషయానికే బాలుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి తల్లిపై ఫిర్యాదు చేయడంపై పోలీసులు ఆశ్చర్యపోయారు.

సీఐ చంద్రశేఖర రావు ఆ బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని వారిని స్టేషన్ వద్దకు పిలిపించాడు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత బాలుడిని అప్పగించి పంపారు. నచ్చిన చొక్కా అడిగితే ఇవ్వలేదని ఇంట్లో తల్లిపై అలిగిన బాలుడు పోలీసులను ఆశ్రయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే కాదు.. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. నాన్న అమ్మను కొడుతున్నాడని.. నా పెన్సిల్ పోయిందని.. సైకిల్ వెతికిపెట్టాలని.. పిల్లలు నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

First Published:  15 May 2023 9:29 AM GMT
Next Story