అది పద్ధతి కాదు.. టీడీపీ పోటీకి రాకూడదు -బొత్స
టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెడితే ఈనెల 30న పోలింగ్ జరుగుతుంది. బొత్స ఒక్కరే అభ్యర్థి అయితే మాత్రం ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.
విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నేడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజార్టీ ఉందని, టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తాను అనుకోవడం లేదన్నారాయన. ఒకవేళ టీడీపీ అభ్యర్థిని బరిలో దింపితే అది దుశ్చర్యేనని తేల్చి చెప్పారు. టీడీపీ పోటీకి రావడం పద్ధతి కాదన్నారు. మెజార్టీ లేనప్పుడు గతంలో తాము పోటీకి రాలేదని, ఇప్పుడు టీడీపీ కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు బొత్స.
838 ఓట్లలో 500 పైచిలుకు ఓట్లు మాకు ఉన్నాయి
— Rahul (@2024YCP) August 12, 2024
- బొత్స సత్యారాయణ pic.twitter.com/elhuHETTaf
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ దాఖలు చేసినా, టీడీపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడం విశేషం. నామినేషన్ దాఖలుకు రేపే ఆఖరు. అయినా టీడీపీ ఇంకా చర్చల్లోనే ఉంది. పేరు ఖరారైందని వార్తలొస్తున్నా అది అధికారికం కాదు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే పరువు పోతుందని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులందర్నీ క్యాంప్ లకు తరలించారు. టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెడితే ఈనెల 30న పోలింగ్ జరుగుతుంది. బొత్స ఒక్కరే అభ్యర్థి అయితే మాత్రం ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు నెలల గ్యాప్ లో జరుగుతున్న విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. వాస్తవానికి ఇక్కడ వైసీపీకే క్లియర్ మెజార్టీ ఉంది. కానీ స్థానిక ప్రజా ప్రతినిధుల్ని తనవైపు తిప్పుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఎలాగైనా ఆ స్థానం కైవసం చేసుకోవాలనుకుంటోంది. సీనియర్ నేత బొత్సను అభ్యర్థిగా ప్రకటించి జగన్ తెలివైన స్టెప్ వేశారు. ఆ ఎత్తుకి ఫలితం ఉంటుందో లేదో త్వరలో తేలిపోతుంది.