Telugu Global
Andhra Pradesh

బాబుకు హైకోర్టులో షాక్‌

పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబులపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

బాబుకు హైకోర్టులో షాక్‌
X

చంద్రబాబుకు హైకోర్టులో షాక్‌ తగిలింది. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు కొట్టివేతకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు, టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌లను బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్‌ పాటిల్, శైలేష్‌ బ్రహ్మేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తాజాగా తీర్పు వెలువరించింది. పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబు అనుచితంగా వ్యవహరించారనడానికి ఆధారాలున్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.

పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబులపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఘటనలో అనేకమంది పోలీసు అధికారులు గాయపడినట్లు మెడికల్‌ సర్టిఫికెట్లు కూడా ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీసు సిబ్బందిపై దాడి చేయాలనే ఈ నేరం చేసినట్లు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆ కేసు వివరాలివీ..

2010 జూలైలో చంద్రబాబు, ఆనంద్‌ బాబు తదితరులను కలిపి మొత్తం 66 మందిని రిమాండుకు తరలించి ధర్మాబాద్‌లోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లోని తాత్కాలిక జైలులో ఉంచారు. వారి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించడంతో మహారాష్ట్ర జైళ్ల డీఐజీ వారిని ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే, చంద్రబాబు, ఆనంద్‌ బాబు దీన్ని అడ్డుకోవడంతో పాటు తెలుగు, ఇంగ్లిష్‌లో పోలీసు అధికారులను దూషించారు. అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతో పాటు పోలీసులపై దాడి చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు, ఆనంద్‌ బాబు తదితరులను ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టేయాలని చంద్రబాబు, నక్కా ఆనంద్‌బాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం రద్దు చేసింది.

First Published:  14 May 2024 6:17 AM GMT
Next Story