Telugu Global
Andhra Pradesh

బెజవాడ బస్టాండ్‌లో రెచ్చిపోయిన బ్లేడ్‌ బ్యాచ్, యాచకులు

ఘటనపై పోలీసులు సమాచారం అందించడంతో అదనపు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొంతమందిని పట్టుకున్న పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

బెజవాడ బస్టాండ్‌లో రెచ్చిపోయిన బ్లేడ్‌ బ్యాచ్, యాచకులు
X

విజయవాడ బస్టాండ్‌లో బ్లేడ్‌ బ్యాచ్, యాచకులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బస్టాండ్‌ అంతటా వీరంగం సృష్టించారు. ఏకంగా పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఒకేసారి దాదాపు 100 మంది దాడి చేసేందుకు దూసుకురావడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన బెంచీలను బ్లేడ్‌ బ్యాచ్, యాచకులు ఆక్రమించారు. వాటిపైనే నిద్రించారు. కూర్చునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పలువురు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది పోలీసులతో కలసి వారితో బెంచీలు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో బ్లేడ్‌ బ్యాచ్, మద్యం తాగి నిద్రపోతున్న యాచకులు ఒక్కసారిగా వారిపై దాడికి యత్నించారు. సుమారు వందమందికి పైగా ఒక్కసారిగా వారిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. అయితే సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిపై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడికి పాల్పడింది. దీంతో ఆయన గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించడంతో అదనపు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొంతమందిని పట్టుకున్న పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్‌లోకి బ్లేడ్‌ బ్యాచ్‌లను, యాచకులను రానివ్వకపోవడంతో వారంతా బస్టాండుకు వస్తున్నారు. అక్కడి నుంచి కూడా తమను బయటకు పంపడాన్ని నిరసిస్తూ వారు దాడికి తెగబడ్డారు.

First Published:  24 March 2024 9:58 AM IST
Next Story