హరిహర వీరమల్లు సినిమాకు బ్లాక్ మనీ.. పవన్‌పై పోతిన సంచలన ఆరోపణలు
మంగళగిరిలో పార్టీ ఆఫీసు కొనుగోలు చేసేందుకు ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయో..ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఎంత సేకరించారో ఆ వివరాలన్ని వెబ్‌సైట్‌లో పెట్టాలన్నారు పోతిన.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు పోతిన మహేష్. చంద్రబాబు దగ్గర పవన్‌కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనంటూ హాట్ కామెంట్స్ చేశారు. జైలులో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పవన్ కొన్న ఆస్తులు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు త్వరలోనే తాను బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇక కౌలు రైతులకు సాయం పేరుతో NRIల నుంచి పవన్ వసూలు చేసిన చందాలెంత..! అందులో రైతులకు ఇచ్చింది ఎంత అంటూ పవన్‌కు వరుస ప్రశ్నలు సంధించారు పోతిన. ఏ ఎజెండాతో పార్టీ పెట్టి.. ఏ జెండా కోసం పని చేస్తున్నారంటూ పవన్‌ను నిలదీశారు. చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ కల్యాణ్ లక్ష్యమా..కాపు యువత తెలుగుదేశం జెండాలు మోసే కూలీలుగా కనిపిస్తున్నారా అంటూ పవన్‌పై ఫైర్ అయ్యారు. నాదెండ్ల మనోహర్‌కి స్పోర్ట్స్ కారు కొనేందుకు రూ.10 కోట్లు ఎవరిచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
మంగళగిరిలో పార్టీ ఆఫీసు కొనుగోలు చేసేందుకు ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయో..ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఎంత సేకరించారో ఆ వివరాలన్ని వెబ్‌సైట్‌లో పెట్టాలన్నారు పోతిన. చంద్రబాబు నుంచి ప్యాకేజీ రూపంలో అందిన బ్లాక్‌మనీని హరిహర వీరమల్లు సినిమా ద్వారా వైట్‌మనీగా మార్చుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు పోతిన. పవన్‌పై దిల్ రాజు ఐటీకి ఫిర్యాదు చేసింది నిజం కాదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ఫ్యామిలీది బ్రాండ్ కాదు మోసం, దగా అంటూ నిప్పులు చెరిగారు. తను లేవనెత్తిన అంశాలపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమంటూ జనసేన నేతలకు సవాల్ విసిరారు.