బీజేపీది డబుల్ ఫెయిల్యూర్ సర్కార్.. - బీవీ రాఘవులు
విశాఖపట్నం వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మాట్లాడారని, వాటి గురించి పవన్ కళ్యాణ్‌కు ఏమి తెలుసని రాఘవులు ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీది డబుల్ ఫెయిల్యూర్ సర్కార్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని ఎండగట్టాల్సింది పోయి టీడీపీ, జనసేన పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీ పంచన చేరాయని మండిపడ్డారు. శుక్రవారం రాత్రి భీమవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే.. అప్పట్లో ప్రపంచ బ్యాంకు అప్పు కోసం విజన్ 2020లో చంద్రబాబునాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అనుకూలంగా రాశారని రాఘవులు గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇటీవల విశాఖపట్నం వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మాట్లాడారని, వాటి గురించి పవన్ కళ్యాణ్‌కు ఏమి తెలుసని రాఘవులు ప్రశ్నించారు. ఏడాది పాటు రైతు ఉద్యమం జరిగితే స్వేచ్ఛ కోసం మాట్లాడని పవన్.. ఇక్కడ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం మాట్లాడడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం బాధ్యత అని, అయినా నిర్మించలేకపోయిందని, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించిందని, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వలేకపోగా, అబద్ధాలు వల్లె వేస్తోందని, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేకపోయిందని, అలాంటి బీజేపీని వెనకేసుకురావడమేమిటని రాఘవులు మండిపడ్డారు. కేంద్రంలో ఈసారి ఎన్డీయేకి 100 సీట్లు కూడా రావనే భయంతో నరేంద్ర మోడీ ఉన్నారని ఆయన చెప్పారు.