Telugu Global
Andhra Pradesh

మందడంలో బీజేపీకి దడదడ

సత్యకుమార్ పై ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేశారనేది బీజేపీ నేతల ఆరోపణ. కాదు కాదు, మందడంలో దీక్ష చేస్తున్న దళితులపై బీజేపీ నేతలే దాడి చేశారని నందిగం సురేష్ ఆరోపిస్తున్నారు.

మందడంలో బీజేపీకి దడదడ
X

నిన్న మొన్నటి వరకూ కర్నూలుకు న్యాయ రాజధాని కావాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని స్టేట్ మెంట్లు ఇచ్చిన బీజేపీ, హఠాత్తుగా అమరావతి స్టాండ్ తీసుకుంది. అమరావతే ఏకైక రాజధాని కావాలంటూ ఇటీవల బీజేపీ నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. తాజాగా మందడంలో అమరావతి రైతుల 1200 రోజుల దీక్షకు మద్దతుగా బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు. అమరావతికి మద్దతుగా మాట్లాడారు.

సత్యకుమార్ కారు అడ్డగింత..

మందడంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద సత్యకుమార్ కారుని మూడు రాజధానుల మద్దతుదారులు అడ్డుకున్నారు. కారులోనుంచి సత్యకుమార్ దిగారు. ఆయనపై ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేశారనేది బీజేపీ నేతల ఆరోపణ. కాదు కాదు, మందడంలో దీక్ష చేస్తున్న దళితులపై బీజేపీ నేతలే దాడి చేశారని నందిగం సురేష్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో ఏది నిజం, ఎంత నిజం అనేది తేలాల్సి ఉంది. అయితే అమరావతి రైతుల దీక్షకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సత్యకుమార్ కారుని కొంతమంది అడ్డగించారు, అందుకే అక్కడ రచ్చ జరిగిందనేది మాత్రం వాస్తవం.

వైసీపీ వర్సెస్ బీజేపీ..

కొత్తగా బీజేపీ కూడా అమరావతికి మద్దతిస్తూ మాట్లాడటంతో వైసీపీ నాయకులు బీజేపీని టార్గెట్ చేశారు. అదే సమయంలో ఏపీలో బీజేపీ, వైసీపీ కలసిపోయాయనే టాక్ జనాల్లో ఉందని, ఆ అపోహల్ని తొలగించుకుంటామంటూ ఇటీవలే కొంతమంది బీజేపీ సీనియర్లు సెలవిచ్చారు. ఒకవేళ ఆ తొలగింపులో భాగంగా ఈ గొడవలు జరిగాయా అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తమ్మీద అమరావతి వ్యవహారంలో బీజేపీ, వైసీపీ కొట్టుకోవడం మాత్రం ఇక్కడ విశేషం. టీడీపీ నేతలు, జనసేన నేతలు, వైసీపీ రెబల్ కోటంరెడ్డి కార్లు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లిపోయాయి కానీ, సత్యకుమార్ కారుకి మాత్రమే మూడు రాజధానుల శిబిరం వద్ద బ్రేక్ పడింది,

First Published:  31 March 2023 5:42 PM IST
Next Story