Telugu Global
Andhra Pradesh

బీజేపీతో టీడీపీ.. వైసీపీకి కష్టమా..? నష్టమా..?

బీజేపీ భజనలో అందరూ అందరే. పార్లమెంట్ లో బిల్లులకు జై కొట్టే విషయంలో ఏ ఒక్కరూ తీసిపోరు, వ్యతిరేకంగా ఓటు వేసేంత ధైర్యం చేయరు. ఇందులో ఎవరి లాజిక్ లు వారివి. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి.

బీజేపీతో టీడీపీ.. వైసీపీకి కష్టమా..? నష్టమా..?
X

అందరూ కట్టగట్టుకుని వచ్చినా మేం సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తాం.. 175 స్థానాలు గెలుస్తాం అని చెబుతున్న వైసీపీ నేతలు, అదే సమయంలో టీడీపీ 175 స్థానాల్లో ఎందుకు ఒంటరిగా పోటీ చేయదు, జనసేనకు అన్నిచోట్లా నామినేషన్ వేసే దమ్ములేదా, బీజేపీ ఎందుకు పొత్తులు పెట్టుకుంటుంది..? అని లాజిక్ లు తీస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత కూడా ఇదే తరహా విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమాన్ని చంద్రబాబు రాజకీయాలకు వేదికగా చేసుకున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రపతి భవన్ లో రాజకీయాలేంటని ప్రశ్నించారు.

వంగి వంగి, నంగి నంగి..

నడ్డాతో చంద్రబాబు వంగి వంగి.. నంగి నంగిగా మాట్లాడారంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మాటకొస్తే ఏపీలో ఏ పార్టీ అధినేతకు కూడా ఢిల్లీ వెళ్లి రొమ్ము విరుచుకుని మాట్లాడే దమ్ము ఉందని అనుకోలేం. కేంద్రం మెడలు వంచేస్తామన్నోళ్లు కూడా ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఎంత వినయ విధేయతలు ప్రదర్శించారో అందరికీ తెలుసు. బీజేపీ భజనలో అందరూ అందరే. పార్లమెంట్ లో బిల్లులకు జై కొట్టే విషయంలో ఏ ఒక్కరూ తీసిపోరు, వ్యతిరేకంగా ఓటు వేసేంత ధైర్యం చేయరు. ఇందులో ఎవరి లాజిక్ లు వారివి. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి.

వైసీపీకి కష్టమా..? నష్టమా..?

వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుంది సరే. మరి మిగతా పార్టీలు కలిస్తే ఆ పార్టీకి నష్టమా..? కష్టమా..? అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి పదే పదే వైసీపీ, జనసేనను అన్ని స్థానాల్లో సింగిల్ గా పోటీ చేయాలని రెచ్చగొట్టడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమే. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా మేజర్ పార్ట్ వైసీపీకి దక్కింది. 2024లో ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం. ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే, అది కూటమికి నేరుగా ట్రాన్స్ ఫర్ కావడం వైసీపీకి ఇష్టం లేదు. ఆ ఓటు ముక్కలు చెక్కలైతే వైసీపీకి లాభం. అందుకే అక్రమ పొత్తులు, అనైతిక కలయికలు.. అంటూ ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. బీజేపీ పొత్తుకు తహతహలాడుతున్న చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారంటూ స్టేట్ మెంట్లిస్తున్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు ఏపీ పరువు తీస్తుంటే ఈసారి 23కంటే ఇంకా తక్కువ సీట్లే వస్తాయి. అది వైసీపీకి లాభమే కానీ నష్టం కాదు. తప్పులు చేస్తున్న చంద్రబాబుని అలా వదిలేయడమే వైసీపీకి మంచిది, మీరు తప్పులెందుకు చేస్తున్నారు అంటూ లాజిక్ లు తీసి ఆయన్ను సరైన దారిలో పెట్టాలనుకోవడమే ఇక్కడ లాజిక్ లకు అందని ప్రశ్న.

First Published:  31 Aug 2023 6:36 AM IST
Next Story