విశాఖలో గంటాకి ఎసరు పెడుతున్న విష్ణు రాజు.. పొత్తు తంట
వాస్తవానికి టీడీపీ తరఫున అక్కడ గెలిచిన గంటా శ్రీనివాసరావుకి కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయ్యింది. అతను వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై కేవలం 1944 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు సీటుకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు ఎసరు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత కొన్నిరోజులుగా యాక్టీవ్‌గా ఉంటున్న విష్ణు.. మరోసారి తన అదృష్టాన్ని అక్కడి నుంచి పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. 2019లో బీజేపీ తరఫున పోటీచేసిన అతనికి కేవలం 18,790 ఓట్లు.. అంటే నియోజకవర్గంలో 11% ఓట్లని మాత్రమే రాబట్టగలిగారు. 2024 ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నాయి.
గంటాకి అప్పట్లోనే చెమటలు
వాస్తవానికి టీడీపీ తరఫున అక్కడ గెలిచిన గంటా శ్రీనివాసరావుకి కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయ్యింది. అతను వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై కేవలం 1944 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దానికి తోడు గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో గంటా యాక్టీవ్‌గా లేరు. అలానే టీడీపీ కార్యక్రమాలకీ కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మళ్లీ చురుగ్గా నిరసన కార్యక్రమాలతో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన కోసం ప్రయత్నాలు
2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. అలానే బీజేపీ ఈ పొత్తులో భాగస్వామ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును ఫైనల్ చేయాలని విష్ణు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ ఉత్తరలో 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పసుపులేటి ఉషా కిరణ్ పోటీ చేయగా.. అప్పట్లో 19,139 ఓట్లు వచ్చాయి. ఈసారి ఉషా కిరణ్ అంత యాక్టీవ్‌గా కనిపించడం లేదు.
సొంత జిల్లాకి గంటా తరలింపు
గంటా శ్రీనివాసరావుని అతని సొంత జిల్లా ఒంగోలుకు పంపాలని టీడీపీ ఇప్పటికే ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు అతను దూరంగా ఉన్నారు. కానీ.. ఇప్పుడు గంటా నుంచి మరో స్వరం కూడా వినిపిస్తోంది. తనతో పాటు తన కుమారుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. మరి ఈ విషయంలో టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.