Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరికి షాక్.. పార్టీలో తిరుగుబాటు

పార్టీ బలోపేతానికి ఇంతవరకు అధ్యక్షురాలు ఒక్క కార్యక్రమం చేయలేదన్నారు. మరిది చంద్రబాబును, టీడీపీని రక్షించటమే పురందేశ్వరి పనిగా పెట్టుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు.

పురందేశ్వరికి షాక్.. పార్టీలో తిరుగుబాటు
X

బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి పెద్ద షాక్ తగిలింది. ఆమె వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సుబ్బారెడ్డి బాహాటంగా మండిపడ్డారు. అధ్యక్షురాలైన దగ్గర నుంచి పురందేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోస‌మే పాటుపడుతున్నట్లు తీవ్రంగా ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే పురందేశ్వరి బీజేపీని దెబ్బతీస్తున్నట్లు మండిప‌డ్డారు. పార్టీ బలోపేతానికి ఇంతవరకు అధ్యక్షురాలు ఒక్క కార్యక్రమం చేయలేదన్నారు. మరిది చంద్రబాబును, టీడీపీని రక్షించటమే పురందేశ్వరి పనిగా పెట్టుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు.

ఇదే విధమైన ఆరోపణలు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పురందేశ్వరిపైన చేస్తున్న విషయం తెలిసిందే. సుబ్బారెడ్డి అన్నారని కాదుకానీ ఆమె వ్యవహారశైలి అలాగే ఉంది. ఎలాగంటే.. జగన్మోహన్ రెడ్డిపైన ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ చంద్రబాబుకు కూడా వర్తిస్తాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఇసుక అక్రమాలు, మద్యం కుభకోణంతో పాటు అవినీతి యధేచ్చగా జరిగింది. అయితే పురందేశ్వరి కేవలం జగన్‌ను మత్రమే టార్గెట్ చేస్తు చంద్రబాబు గురించి ఒక్క మాటకూడా మాట్లాడటంలేదు. దీంతో చంద్రబాబు అవినీతిని పురందేశ్వరి కప్పిపెడుతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

నిజానికి వైసీపీతో పాటు టీడీపీకి కూడా బీజేపీ ప్రత్యర్థి పార్టీనే. కానీ, పురందేశ్వరి టార్గెట్ అంతా జగన్ పైనే పెట్టి చంద్రబాబును వదిలేస్తున్నారు. దీంతో పురందేశ్వరి బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు లేదా టీడీపీపై ఈగవాలనీయకుండా కాపాడుతున్నారనే వాదన పార్టీలోనే పెరిగిపోతోంది. కాకపోతే ఆమెతో డైరెక్టుగా ఎవరు చెప్పినట్లు లేదు. బీజేపీని సొంతంగా బలోపేతం చేయడం మానేసిన పురందేశ్వరి టీడీపీని కాపాడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సుబ్బారెడ్డి ఆరోపించారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకోసమే పురందేశ్వరి పాకులాడుతున్నట్లు మండిపడ్డారు. ఎలాగైనా సరే వచ్చేఎన్నికల్లో తాను గెలవాలన్నదే పురందేశ్వరి ఆలోచనగా కనిపిస్తోందన్నారు. టీడీపీతో పొత్తుంటే తప్ప గెలవలేమని అనుకునే పురందేశ్వరి అన్నీ విషయాల్లో టీడీపీని వెనకేసుకొస్తోందని సుబ్బారెడ్డి మండిపడ్డారు. టీడీపీకి జనసేనను దగ్గరచేసింది కూడా పురందేశ్వరే అని ఆయన ఆరోపించారు. బంధుప్రతి, కులతత్వంతో పురందేశ్వరి బీజేపీని భ్రష్టుపట్టిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. కాబట్టి వెంటనే పురందేశ్వరి అధ్యక్షురాలిగా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సుబ్బారెడ్డి ఆరోపణలు, డిమాండ్ పార్టీలో సంచలనంగా మారింది. మరి పురందేశ్వరి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

First Published:  5 Nov 2023 5:37 AM
Next Story