Telugu Global
Andhra Pradesh

ఎంత తిట్టినా బాబే కావాలా!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓటమి పాల‌వ్వ‌డంతో.. పార్టీకి మిత్రులు అవ‌స‌రమ‌య్యారు. తెలుగు రాష్ట్రాల్లోని అధికార వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీకి దూరంగానే ఉంటున్నాయి. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌పై క‌త్తులు దూసిన చంద్ర‌బాబునే బీజేపీ అగ్ర‌నేత‌లు మ‌ళ్లీ కొరుకుంటున్నారు.

ఎంత తిట్టినా బాబే కావాలా!
X

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు అనేది నానుడి.. దాన్ని అనేక సందర్భాల్లో చాలామంది నేతలు, పార్టీలు నిజం చేశాయి. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి రాజకీయాలు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందు వరుసలో ఉంటారనేది చాలా సంద‌ర్భాల్లో స్వయంగా ఆయనే ప్రూవ్ చేసుకున్నారు. ఎదుటి పార్టీతో.. ఎదుట వ్యక్తితో పని లేదనుకుంటే తాను, తన మీడియా ఎంతగా రెచ్చిపోతుందో అందరికీ తెలుసు. అలాంటి వ్య‌క్తికి ఈ నెల 18న ఎన్‌డీఏ ప‌క్షాలు నిర్వ‌హిస్తున్న‌ కీల‌క స‌మావేశానికి ఆహ్వానం అందిన‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

2014 ఎన్నికల ముందు నరేంద్ర మోడీ హ‌వా నడుస్తుందని భావించిన చంద్ర‌బాబు త‌న‌ పరిచయాల ద్వారా బీజేపీకి దగ్గరై పొత్తు పెట్టుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి మూడున్నర ఏళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన త‌రువాత త‌న‌ సామాజికవ‌ర్గ‌ మీడియా పెద్దలు చెప్పారని బీజేపీకి దూరమై.. బీజేపీకి అతిపెద్ద ప్ర‌ధాన‌ శత్రువు అయిన కాంగ్రెస్‌తో చేత‌లు క‌లిపారు. 2019 ఎన్నికల్లో ఘోర ప‌రాభ‌వం పొందిన‌ప్పటి నుంచి ఒక్క మాట కూడా బీజేపీపై నోరెత్తకుండా ఉంటూ.. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీకి సపోర్ట్ చేస్తూ మీడియాలో నరేంద్ర మోడీని పొగుడుతూ వస్తున్నారు. అలాంటి చంద్ర‌బాబు.. ఎన్‌డీఏ ప‌క్షాలు నిర్వ‌హిస్తున్న‌ కీల‌క స‌మావేశానికి వెళ్లితే త‌ను అనుకున్న‌ది సాధించిన‌ట్లే.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓటమి పాల‌వ్వ‌డంతో.. పార్టీకి మిత్రులు అవ‌స‌రమ‌య్యారు. తెలుగు రాష్ట్రాల్లోని అధికార వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీకి దూరంగానే ఉంటున్నాయి. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌పై క‌త్తులు దూసిన చంద్ర‌బాబునే బీజేపీ అగ్ర‌నేత‌లు మ‌ళ్లీ కొరుకుంటున్నారు. మ‌రోవైపు బీజేపీ వ్య‌తిరేక కూట‌మిని కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం చేస్తుండ‌టంతో పాత మిత్రుల‌ను ద‌గ్గ‌రకు తీస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

బీజేపీ కూట‌మి నుంచి బ‌య‌టి వ‌చ్చిన త‌రువాత ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు దేశం మొత్తం ప్ర‌చారం చేశారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కారుపై రాళ్లు వేయించిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌కే ద‌క్కుతుంది. ఇంత చేసినా చంద్ర‌బాబుపై బీజేపీ నేత‌లు ప్రేమ కురిపించ‌డమంటే రాజ‌కీయ అవ‌స‌రం కాక మ‌రేంటి? ఎన్టీఏ కూట‌మిలో చేరితే పార్టీకి మరింత న‌ష్టం జ‌రుగుతుంద‌ని కొంత మంది టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈసారి జ‌న‌సేనతో క‌లిసి వెళ్లి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బీజేపీ కూట‌మిలోకి వెళ్ల‌డం మంచిద‌ని స‌ల‌హాలు ఇస్తున్నారు.

చంద్ర‌బాబు మాత్రం ప్ర‌యోగాలు చేయ‌డానికి త‌న‌కు టైం లేద‌ని.. ఈసారి గెల‌వ‌క‌పోతే పార్టీ క‌నుమ‌రుగు అవుతుంద‌ని భావించి.. బీజేపీతో స్నేహం చేయ‌డానికి ఎటువంటి మోహ‌మాటం లేద‌ని చెబుతున్నారు. టీడీపీ-బీజేపీల పొత్తుల వ్య‌వ‌హారంపై ఈ నెల 18న క్లారిటి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాక‌పోతే బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీలు పంచుకునే సీట్ల వైపే అంద‌రూ ఎదురు చూస్తున్నారు.

First Published:  7 July 2023 5:07 PM IST
Next Story