Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్‌పై పేటెంట్ హక్కు పోటీ మొదలైందా?

త్వ‌ర‌లో ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుండే ప్రారంభించబోతున్నట్లు ప్రొద్దుటూరులో జ‌రిగిన కార్యకర్తల సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్‌పై పేటెంట్ హక్కు పోటీ మొదలైందా?
X

మంచి-చెడు, నైతికతను పక్కనపెట్టేస్తే ఇన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ జపం చేయటంలో పేటెంట్ హక్కు తమకు మాత్రమే ఉందని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. బహిరంగసభలు, పార్టీ కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పదేపదే ఎన్టీఆర్‌ జపం చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తుకొస్తుంటారు. అలాంటి ఎన్టీఆర్‌ పేరుపై పేటెంట్ హక్కు కోసం పోటీ మొదలైంది. అది కూడా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి నుండే కావటం ఆసక్తిగా మారింది.

విషయం ఏమిటంటే ప్రొద్దుటూరులో బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. తొందరలోనే ఎన్నికల ప్రచారాన్ని తాను రాయలసీమ నుండే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ కూడా ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడూ రాయలసీమ నుండే మొదలుపెట్టేవార‌నే విషయాన్ని గుర్తు చేశారు. తండ్రిబాటలోనే తాను కూడా నడుస్తానని ప్రకటించారు. తన తండ్రి అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పురందేశ్వరి గుర్తు చేశారు.

విషయం చూస్తుంటే బీజేపీ అధ్యక్షురాలి హోదాలో పురందేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్‌ పేరును పదేపదే ప్రస్తావించేట్లుగానే ఉన్నారు. పరిపాలనలో తెచ్చిన సంస్కరణలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించటం ద్వారా బీజేపీ కూడా ఎన్టీఆర్‌ను అనుసరిస్తుందనే కలరింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లున్నారు. మరిదే జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే అనుకోవాలి. ఎలాగంటే చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా ఎన్టీఆర్‌ పరిపాలనను పదేపదే ప్రస్తావిస్తుంటారు. పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎన్టీఆర్‌ అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తుంటారు.

ఇప్పుడు అదే విషయాన్ని పురందేశ్వరి కూడా గుర్తు చేస్తున్నారు. అంటే ఒక విధంగా చంద్రబాబు-పురందేశ్వరి మధ్య ఎన్టీఆర్‌ పేరుపై పేటెంట్ హక్కుల కోసం పోరాటం మొదలైనట్లే అనుకోవాలి. ఇంతకాలమంటే చంద్రబాబు, బాలకృష్ణ కారణంగా ఎన్టీఆర్‌ పేరు వాడుకునేందుకు ఇతర పార్టీలకు హక్కు లేకుండా పోయింది. అయితే ఊహించని రీతిలో ఎన్టీఆర్‌ కూతురు పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలయ్యారు. కాబట్టి పరిపాలనలో సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలులో నరేంద్ర మోడీతో ఎన్టీఆర్‌ పేరును కలిపి పురందేశ్వరి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించినా అభ్యతరం పెట్టేవాళ్ళుండరు. ఎందుకంటే తండ్రి పేరును కూతురు ప్రస్తావించకూడదని ఎవరు అనలేరు కాబట్టి.

First Published:  25 July 2023 12:20 PM IST
Next Story