Telugu Global
Andhra Pradesh

విశాఖపై ఆశలు వదులుకోని బీజేపీ.. నడ్డాకు లేఖ

విశాఖ ఎంపీ సీటు జీవీఎల్‌కు దక్కుతుందని పార్టీ కేడర్ భావించిందన్నారు కార్యకర్తలు. గత మూడేళ్లుగా జీవీఎల్‌ అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పార్టీ కోసం కష్టపడ్డారని లేఖలో వివరించారు.

విశాఖపై ఆశలు వదులుకోని బీజేపీ.. నడ్డాకు లేఖ
X

తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో ఇంకా అసమ్మతి చల్లారలేదు. టికెట్ ఆశించి భంగపడిన మూడు పార్టీల నేతలు అసంతృప్తి సర్వాన్ని వినిపిస్తున్నారు. టికెట్ ద‌క్క‌ని నేతల వైఖరి కూటమికి తలనొప్పిగా మారింది. పైకి అంతా ప్రశాంతంగానే కనపడుతున్నప్పటికీ.. అంతర్గతంగా కత్తులు దూసుకుంటున్నారు కూటమి నేతలు. ఇప్పుడు విశాఖలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. విశాఖ ఎంపీ సీటును పట్టుబట్టి తీసుకున్న తెలుగుదేశం పార్టీ.. అభ్యర్థిగా బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌ను ప్రకటించింది.

అయితే బీజేపీ నేతలు విశాఖ సీటుపై ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ మేరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. విశాఖ సీటు విషయంలో తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలన్నారు. దశాబ్ధాలుగా బీజేపీకి, విశాఖకు అనుబంధం ఉందని లేఖలో వివరించారు. మేయర్‌గా NSN రెడ్డి సేవలు మొదలుకొని.. కంభంపాటి హరిబాబు, భట్టం శ్రీరామమూర్తి, విష్ణుకుమార్ రాజు, వి.ఎన్‌.మాధవ్‌ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించారని లేఖలో గుర్తుచేశారు.

విశాఖ ఎంపీ సీటు జీవీఎల్‌కు దక్కుతుందని పార్టీ కేడర్ భావించిందన్నారు కార్యకర్తలు. గత మూడేళ్లుగా జీవీఎల్‌ అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పార్టీ కోసం కష్టపడ్డారని లేఖలో వివరించారు. స్థానిక సమస్యలపై GVL పోరాటం చేశారని లేఖలో చెప్పుకొచ్చారు. విశాఖలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తారని లేఖలో గుర్తుచేశారు. వెంటనే విశాఖపట్నం పార్లమెంట్ సీటును బీజేపీ తీసుకుని.. GVLను పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేయాలని డిమండ్ చేశారు. ఒకవేళ నిర్ణయంలో మార్పు లేకపోతే విశాఖ పార్లమెంట్ సీటు నుంచి స్నేహపూర్వక పోటీలో ఉండేందుకు అనుమతివ్వాలని కోరారు. GVL ఎన్నికల్లో నిలబడాలనేది తమ కోరిక అని లేఖలో స్పష్టం చేశారు కార్యకర్తలు. ఒకవేళ బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం మార్చుకోకపోతే స్థానికంగా కూటమి అభ్యర్థిగా ఉన్న భరత్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

First Published:  4 April 2024 11:33 AM IST
Next Story