బీజేపీతో కల్యాణం - టీడీపీతో సంసారం
విజయవాడ సీటు తనకిస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చంతా తాను పెట్టుకుంటానని చెప్పారట. టీడీ జనార్దన్ ద్వారా మధ్యవర్తిత్వం నడుస్తోంది. అదే సమయంలో నారా లోకేష్ ని కూడా సుజనా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మాజీ ఎంపీ సుజనా చౌదరి బీజేపీకి హ్యాండివ్వబోతున్నారా..? బీజేపీలో ఉంటూనే ఆయన టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారా..? బీజేపీతో కల్యాణం, టీడీపీతో సంసారం ఎందుకు..? రాజ్యసభ సభ్యత్వం పూర్తవడంతో కొంతకాలంగా పదవికోసం అర్రులు చాస్తున్న సుజనా ఓ బ్రహ్మాండమైన పథకం వేశారు. ఆ పథకం అమలులోకి రాకముందే లీకైంది. బీజేపీ అధిష్టానం సుజనాపై గుర్రుగా ఉంది. బీజేపీకి కోపం వస్తే అది తన పీకకు ఎక్కడ చుట్టుకుంటుందోనని చంద్రబాబు గూడా తెగ టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి సుజనా రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతాడనే ప్రచారం మొదలైంది.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి కూడా ఒకరు. ఆయన పదవీకాలం పూర్తవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని తెలుస్తోంది. అయితే అది బీజేపీతో కాదు, టీడీపీ టికెట్ పై విజయవాడ లోక్‌సభకు సుజనా పోటీ పడాలని ఆశపడుతున్నారట. వైసీపీ హవాలో కూడా టీడీపీకి అచ్చొచ్చిన స్థానం కావడంతో విజయవాడపై ఆయన కన్నుపడింది. కానీ అదంత ఈజీ కాదు, అక్కడ కేశినేని నాని పాతుకుపోయారు. ఆయనతో ఇటీవల చంద్రబాబుకి విభేదాలున్నట్టు తేలిపోయింది. దీంతో అక్కడ కేశినేని తమ్ముడు బుజ్జిని చంద్రబాబు దగ్గరకు తీశారు. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న కొట్లాటలో ఇప్పుడు సుజనా చౌదరి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
రాయ'బేరాలు'..
అప్పట్లో చంద్రబాబు సలహాతోనే రాజ్యసభ సభ్యులు మూకుమ్మడిగా టీడీపీని వదిలి బీజేపీలో చేరారనే ప్రచారం జరిగింది. వారెప్పుడూ టీడీపీని వ్యతిరేకించలేదు, బాబుపై మాటతూలలేదు. స్వామి భక్తి చాటుకుంటూనే ఉన్నారు. వ్యవహారం చెడకుండా నెట్టుకొచ్చిన సుజనా ఇప్పుడు టీడీపీలోకి తిరిగి వచ్చేస్తానంటున్నారు. అయితే ఈసారి విజయవాడ సీటుకి కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ఆయన ఆపసోపాలు పడుతున్నారు. చంద్రబాబు కి మంచి "ఆఫర్" కూడా ఇచ్చారు. విజయవాడ సీటు తనకిస్తే, కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చంతా తాను పెట్టుకుంటానని చెప్పారట. టీడీ జనార్దన్ ద్వారా మధ్యవర్తిత్వం నడుస్తోంది. అదే సమయంలో నారా లోకేష్ ని కూడా సుజనా ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ ఎంపీ సీటుకోసం బేరం ఎంతైనా ఓకే అంటూ రాయబారం పంపించారు. చంద్రబాబుతో ఆల్రడీ టీడీ జనార్దన్ చర్చలు ముగిశాయి, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ప్రచారం జరుగుతోంది.
ఈలోగా ఇటు విజయవాడలో కేశినేని బుజ్జి వర్గం అలిగింది. అటు బీజేపీ నేతలు కూడా సుజనా వ్యవహారంపై మండిపడుతున్నారు. రాజ్యసభ సభ్యత్వం ఉన్నన్ని రోజులు బీజేపీ అండతో కేసులనుంచి తప్పించుకున్న సుజనా, ఇప్పుడు పదవీకాలం ముగియడంతో మరోసారి బీజేపీ ఆ అవకాశం ఇవ్వదని తేలిపోవడంతో టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన స్వార్థపరుడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. బీజేపీ అగ్రనాయకత్వం కూడా సుజనా వ్యవహారంపై ఆగ్రహంతో ఉందని సమాచారం.