రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోదే .. మాకేం సంబంధం లేదు - బీజేపీ ఎంపీ జీవీఎల్
రాష్ట్ర నేతలు ఇక్కడ అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతుండగా.. కేంద్ర స్థాయిలోని వ్యక్తులు మాత్రం.. రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనిదే అని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో అమరావతి రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైన విషయమని తెలిసిందే. రైతులు పాదయాత్ర చేస్తుండటమే అందుకు కారణం.. రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కుండ బద్దలు కొట్టేసింది. తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పటికే రాజధాని విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో నేడు సుప్రీం తలుపు తట్టింది.
ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం రాజధాని విషయంలో ఇంకా గందరగోళ వైఖరినే అవలంభిస్తోంది. గతంలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని బీజేపీ పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమానికి బీజేపీ పెద్దలు మద్దతు పలికారు. ఇప్పుడు కూడా మద్దతు ఇస్తూనే ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే అమరావతిని నిర్మించి తీరుతామని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు.
కాగా, ఈ విషయంపై నేడు బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏమన్నారంటే.. ' అమరావతి ఉద్యమానికి రాష్ట్ర బీజేపీ మద్దతు కొనసాగుతుంది. కానీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమే. రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.' అంటూ ఆయన అన్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న అమరావతి ఉద్యమానికి బీజేపీ మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ హైకమాండ్, కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతి విషయంలో కాస్త వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తున్నాయి. రాష్ట్ర నేతలు ఇక్కడ అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతుండగా.. కేంద్ర స్థాయిలోని వ్యక్తులు మాత్రం.. రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనిదే అని వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి బీజేపీలో ఏపీకి బలం లేదు. భవిష్యత్‌లో బలం పెరుగుతుందన్న ఆశ కూడా లేదు. దీంతో ఏదో ఒక ఉద్యమానికి మద్దతు ఇస్తే ఉనికిలో ఉంటామని ఆ పార్టీ భావిస్తున్నట్టుంది.. అందుకే అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వైసీపీ అవసరం ఎంతైనా ఉంది. దీంతో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.