లోకేష్ పాదయాత్ర 400 రోజులు కొనసాగాలని కోరుకుంటున్నాం.. - బీజేపీ ఎంపీ జీవీఎల్ సెటైర్
లోకేష్ పాదయాత్ర 400 రోజులూ కూడా పూర్తిగా కొనసాగేలా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము కూడా కోరుతున్నామని జీవీఎల్ చెప్పారు.
యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర వారు ప్లాన్ చేసుకున్నట్టుగానే 400 రోజులూ కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఎందుకంటే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి కోలుకోగలిగే పరిస్థితి లేదని, ఆ పార్టీకి మిగిలివున్న కాస్త గ్రాఫ్ కూడా లోకేష్ పాదయాత్రతో పూర్తిగా పడిపోయిందని ఆయన తెలిపారు. అందుకే లోకేష్ పాదయాత్ర 400 రోజులూ కూడా పూర్తిగా కొనసాగేలా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము కూడా కోరుతున్నామని ఆయన చెప్పారు.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోతోందని, 2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు. జనసేన కూడా ఇదే కోరుకుంటోందని ఆయన తెలిపారు.
మార్చి 10 తర్వాత `బీజేపీ పోరుయాత్ర` పేరుతో మళ్లీ తాము ప్రజల్లోకి వెళతామని జీవీఎల్ చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం తమ వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టివేసి.. లబ్ధి పొందాలని చూసి దెబ్బతిందని ఎంపీ జీవీఎల్ విమర్శించారు.