'లోక' కల్యాణం కోసం కాదు, 'లోకేష్' కల్యాణార్థం..
చంద్రబాబుని శ్రీరామచంద్రుడితో పోలుస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదన్నారు.
చంద్రబాబు ఆరాటం 'లోక' కల్యాణం కోసం కాదని, 'లోకేష్' కల్యాణార్థం అని సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబుని శ్రీరామచంద్రుడితో పోలుస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని జీవీఎల్ ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదన్నారు.
ఉడతలెవరు..? కోతులెవరు..?
చంద్రబాబుని శ్రీరామ చంద్రుడితో పోలుస్తూ ఇటీవల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శ్రీరామ చంద్రుడు బలవంతుడే అయినా ఆయన అందరి సాయం తీసుకున్నారని, అదే మాదిరిగా చంద్రబాబు కూడా సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు అయ్యన్న. రావణుడిని వధించేటప్పుడు రాముడు.. ఉడతలు, కోతుల సాయం కూడా తీసుకున్నారు. అదే తరహాలో జగన్ ను గద్దె దించడానికి చంద్రబాబు అందరి సాయం తీసుకుంటారన్నారు. అయితే బీజేపీ, జనసేనలో ఉడతలెవరు, కోతులెవరో ఆయన చెప్పలేదు. అసలు చంద్రబాబుని శ్రీరామ చంద్రుడితో పోల్చడం బీజేపీకి నచ్చలేదు.
పొత్తుకోసం పరితపించేది మీరేగా..?
ప్రస్తుతం ఏపీలో టీడీపీ పొత్తులకోసం పరితపిస్తోంది. జనసేనను దువ్వినా, మోదీతో మీటింగ్ తర్వాత పవన్ స్వరం మారింది. బీజేపీని ఎప్పటినుంచో కాకాపట్టాలని చూస్తున్నా కుదరడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు కోసం పరితపించే చంద్రబాబును, శ్రీరాముడితో పోల్చడమేంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ఇతర పార్టీల పొత్తుకోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటని ప్రశ్నించారు జీవీఎల్. అయ్యన్న వ్యాఖ్యలకు కాస్త ఘాటుగానే బదులిచ్చారు.