జనసేన మోసం చేసింది.. బీజేపీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు
ఓటమి పాలైన ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ జనసేనపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీ చేసిన బీజేపీ.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంపై మాత్రం కాస్తో కూస్తో నమ్మకం పెట్టుకుంది. బీజేపీ తరపున పోటీ చేసిన మాధవ్ ని పట్టభద్రులు ఆదరిస్తారని ఆ పార్టీ అంచనా వేసింది. కానీ అక్కడ బీజేపీ నాలుగో స్థానానికి పరిమితమైంది. దీంతో పార్టీలో అంతర్మథనం మొదలైంది. అసలు ఏపీలో మన సంగతేంటి అని ఆలోచిస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా ఓటమి పాలైన ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ జనసేనపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం జరిగిందని అన్నారు.
బీజేపీ, జనసేన అధికారికంగా విడిపోయామని ఎక్కడా ప్రకటించలేదు. అలాగని కలసి కార్యక్రమాలు కూడా చేయడంలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలానా వారికి ఓటు వేయండి అని పవన్ కల్యాణ్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే జనసేన ఓటు తమకేనంటూ అటు టీడీపీ ప్రచారం చేసుకుంది, ఇటు పీడీఎఫ్ కూడా జనసేన మద్దతు తమకేనని చెప్పుకుంది. ఎన్నికలకు ముందే ఈ విషయం పసిగట్టిన బీజేపీ.. పీడీఎఫ్, టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించాలని జనసేనకు సూచించింది. కానీ పవన్ ఎటువంటి ఖండన ప్రకటన చేయలేదు. ఫలితంగా ఉత్తరాంధ్రలో టీడీపీ విజయం సాధించింది. జనసేన ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడింది కానీ, అది బీజేపీ మాధవ్ కి మాత్రం దక్కలేదు. దీంతో ఆయన నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.
జనసేనతో కలిసి ఉన్నాం.. కానీ, కలిసున్నా లేనట్టేనని మేం భావిస్తున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవ్. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని ఎవరైనా నమ్ముతారని, అలా వెళ్లనంత కాలం ఎన్ని ప్రకటనలు చేసినా వృథాయేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన కలిసి రాలేదని ఆరోపించారు. మరో వైపు వైసీపీ, బీజేపీ ఒకటేననే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉందని అంటున్నారు మాధవ్. ఆ అపవాదు తొలగించుకోడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మే నెలలో వైసీపీ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామన్నారు. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయని, ఆ వ్యవహారం హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.