Telugu Global
Andhra Pradesh

ఎందుకు యాక్షన్ తీసుకోవ‌డం లేదు..?

జగన్ పైన ఆరోపణలు చేసినట్లే చంద్రబాబు పాలనలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించాలి కదా. ఆరోపణలతో టార్గెట్ చేయటంలో చంద్రబాబును ఎందుకు వదిలిపెట్టారు..?

ఎందుకు యాక్షన్ తీసుకోవ‌డం లేదు..?
X

ఎందుకు యాక్షన్ తీసుకోవ‌డం లేదు..?

రెండురోజులు వరుసపెట్టి ఆరోపణలే ఆరోపణలు. శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వైజాగ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రెండు బహిరంగసభల్లో మాట్లాడిన నేతలు మారారు కానీ వాళ్ళ టార్గెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డే. వీళ్ళ ఆరోపణలు ఏమిటంటే.. కేంద్రం నుంచి రాష్ట్రప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు వస్తుంటే అవన్నీ ఎటు పోయాయో తెలీటంలేదట. జగన్ ప్రభుత్వం మైనింగ్, మట్టి, భూ కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.

వీళ్ళ ఆరోపణల్లో కామన్ పాయింట్ ఏమిటంటే.. తొమ్మిదేళ్ళల్లో మోడీ ప్రభుత్వం ఏపీకి మంజూరుచేసిన నిధుల్లో భారీఎత్తున అవినీతి జరిగిందన్నారు. కాసేపు నిజమే అని అనుకుంటే.. జగన్ సీఎం అయి నాలుగేళ్ళే కదా అయ్యింది. అంతకుముందు ఐదేళ్ళు చంద్రబాబునాయుడే కదా ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు హయాంలో కూడా భారీగా అవినీతి జరిగిందనే కదా అర్థం. మరి ఆ మాటను నడ్డా కానీ అమిత్ షా కానీ ఎందుకని డైరెక్టుగా చెప్పలేదు.

జగన్ పైన ఆరోపణలు చేసినట్లే చంద్రబాబు పాలనలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించాలి కదా. ఆరోపణలతో టార్గెట్ చేయటంలో చంద్రబాబును ఎందుకు వదిలిపెట్టారు..? చంద్రబాబు అంటే నడ్డా, అమిత్ భయపడుతున్నారా..? లేకపోతే తొందరలోనే టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు అనుకునేందుకు ఇది సంకేతమా..? నరేంద్రమోడీది నిప్పులాంటి ప్రభుత్వమని చెప్పుకుంటున్న వాళ్ళు జగన్ అవినీతికి పాల్పడుతుంటే ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారో అమిత్ షా సమాధానం చెప్పగలరా..?

పైగా ఏపీకి ఎంతో ఇచ్చేశామని చెప్పుకోవటం కూడా అబద్ధమే. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా, విశాఖపట్నం రైల్వేజోన్ హామీలను తుంగలో తొక్కేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీని కట్టలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రవేటుపరం చేసేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం రూ. 2 లక్షల కోట్లిచ్చిందని చెప్పుకుంటున్నదంతా రొటీన్ గా ఇవ్వాల్సిన నిధులు మాత్రమే. అంతేకానీ ఏపీకి అంటూ ప్రత్యేకించి కేటాయించిన నిధులేమీ లేవు. ఈ విషయాలన్నీ తెలుసుకాబట్టే జనాలు బీజేపీకి ఎన్నికల్లో కొర్రుకాల్చి వాతలు పెడుతున్నది.

First Published:  12 Jun 2023 10:25 AM IST
Next Story