సైకిల్ ఎక్కేందుకు విష్ణుకుమార్ రాజు తహతహ
2014 ఎన్నికలలో తెలుగుదేశం పొత్తుతో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు.
విశాఖకి చెందిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సైకిల్ ఎక్కేందుకు తహతహలాడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతం ఇచ్చేలా బీజేపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరుతానని ప్రకటించిన కన్నా లక్ష్మీనారాయణతో విష్ణుకుమార్ రాజు భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీలో పరిస్థితులు ఏ మాత్రం బాగా లేవన్నారు. బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, పార్టీ నేతలతో మాట్లాడే తీరిక అధిష్టానం పెద్దలకు లేదని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కన్నా బాటలోనే విష్ణుకుమార్ రాజు టిడిపిలో చేరతారని అనుకుంటున్నారు.
2014 ఎన్నికలలో తెలుగుదేశం పొత్తుతో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. ఇది ఎంతమాత్రం బీజేపీ బలం కాదు, రాజుగారి చరిష్మా అంతకంటే కాదు. అప్పటి ఎన్నికల్లో టిడిపి బీజేపీ పొత్తుకి పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసొచ్చాయి. 2019 ఎన్నికల్లో పొత్తులు లేకపోవడంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. వచ్చే ఎన్నికలకు బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ఛాయలు కనపడటంలేదు. వైసీపీలో చేరే ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో ఈ బీజేపీ రాజు సైకిల్ ఎక్కే యత్నాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. జనసేనలో చేరితే సీటుకి, గెలుపునకు గ్యారెంటీ లేదని, ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్న దశలో టిడిపిలో చేరడమే మేలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే టిడిపిలో విశాఖలో ఏ స్థానమూ ఖాళీ లేదు. రాజు గతంలో పోటీచేసిన విశాఖ ఉత్తరం ఏ పార్టీ నుంచి కూడా అవకాశం దక్కకపోవచ్చు.
అయితే ఈ ప్రచారాలు విష్ణకుమార్ రాజు వద్ద ప్రస్తావిస్తే, తనదైన శైలిలో నవ్వుతూ కొట్టి పారేస్తున్నారు. తాను కన్నా లక్ష్మీనారాయణని కలిసినందుకే ఈ ప్రచారం చేస్తున్నారని అని, ఆయన బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేశారని మరవొద్దని చెబుతున్నారు. తాను బీజేపీలోనే ఉన్నానని చెప్పుకొస్తున్న విష్ణుకుమార్ రాజుకి ఏమైనా సీటు హామీ దొరికితే తెలుగుదేశంలోనే చేరడం ఖాయమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.