Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరికో న్యాయం, మాకో న్యాయమా?

టీజీ వెంకటేశ్‌పైన పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. టీజీ బీజేపీలో ఉండగా ఆయన కుమారుడు టీడీపీలో ఉన్నారు. నారా లోకేష్ పాదయాత్రను ప్రస్తుతం దగ్గరుండి కర్నూలులో పర్యవేక్షిస్తున్నారు.

పురందేశ్వరికో న్యాయం, మాకో న్యాయమా?
X

ఏపీ బీజేపీలో టీడీపీ అనుకూల, వ్యతిరేక నాయకుల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. బాబు బాగు కోరేవారు, జగన్‌ పతనాన్ని ఆకాంక్షించే నేతలు బీజేపీ బండిని టీడీపీ వైపు బలంగా లాగుతున్నారు. అదే సమయంలో గ‌తంలో చంద్రబాబుతో స్నేహం చేసే ఏపీలో పార్టీ ఇలా అయిపోయిందన్న భావన ఉన్నవారు ఈసారీ టీడీపీని ఓడిస్తే భవిష్యత్తు మనదేనని వాదిస్తున్నారు. కొందరు పార్టీ లైన్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న వారూ ఉన్నారు. బీజేపీలో ఉంటే, వచ్చే ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేస్తే అర శాతం ఓట్లు కూడా రావు.. రాజకీయ జీవితం అంతటితో పరిసమాప్తం అవుతుందన్న భయం వారిది.

అలాంటి వారి జాబితాలో ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్‌ రాజు లాంటి వారి పేర్లు పదేపదే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏబీఎన్‌ ఆర్కే ఇంటర్వ్యూలో పార్టీ లైన్‌ దాటి విష్ణుకుమార్ రాజు మాట్లాడారంటూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన ఏకంగా ఢిల్లీ లిక్కర్ స్కాంపై దృష్టిపెట్టిన వారు, ఏపీలో వేల కోట్ల స్కాం జరుగుతుంటే ఎందుకు స్పందించలేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా బీజేపీ పెద్దలు, జగన్‌ కలిసిపోయారన్న సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. ఈ షోకాజ్ నోటీసులపై విష్ణుకుమార్ రాజు.. ''నేను ఐదేళ్లు బీజేఎల్పీ నేతగా చేశా.. వార్డు మెంబర్‌గా కూడా గెలవడం చేతగాని వాళ్లు బెదిరిస్తే బెదరబోను'' అంటూ పార్టీ నేతల వద్ద మాట్లాడారు.

ఇప్పుడు రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌పైన పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. టీజీ బీజేపీలో ఉండగా ఆయన కుమారుడు టీడీపీలో ఉన్నారు. నారా లోకేష్ పాదయాత్రను ప్రస్తుతం దగ్గరుండి కర్నూలులో పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ టీజీ వెంకటేశ్‌ బొమ్మను ముద్రించారు. ఇలా లోకేష్‌ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీజేపీ నేత బొమ్మ ఉండటంతో ఆ పార్టీ నాయకత్వం సీరియస్ అయింది. నేరుగా కొందరు బీజేపీ రాష్ట్ర పెద్దలు టీజీకి ఫోన్ చేసి ''మీరు ముందు ఏ పార్టీలో ఉన్నారో, ఉండాలనుకుంటున్నారో ఇంట్లో చర్చించుకుని చెప్పండి. ఇలా పక్క పార్టీల ఫ్లెక్సీల్లో మీ ఫొటో వేయించుకోవడం సరికాదు'' అని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం నడుస్తోంది.

దాంతో టీజీ కుటుంబసభ్యులకు, అనుచరులకు చిర్రెత్తుకొచ్చింది. పురందేశ్వరి 2019లో బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆమె భర్త వైసీపీ నుంచి పోటీ చేశారు. మరి అప్పుడు ఎందుకు ఆమెను ప్రశ్నించలేదంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇలాంటి ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల బీజేపీలోనే చాలా చెప్పగలం అంటూ కౌంటర్లు మొదలుపెట్టారు. ఇలా బీజేపీ నాయకత్వం అంటే లెక్కలేకుండా ఎదురుదాడికి నేతలు దిగడానికి కారణం.. ఎన్నికల సమయానికి టీడీపీ గూటికి చేరితేనే బెటర్‌ అన్న భావనేనని ప్రచారం నడుస్తోంది. ఇంతకాలం షెల్టర్‌ కోసం బీజేపీలోకి వచ్చిన వారంతా తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని.. అందులో భాగంగానే కారణాలను సృష్టించుకుంటున్నారన్న ప్రచారమూ బీజేపీలో నడుస్తోంది.

First Published:  9 May 2023 9:14 AM IST
Next Story