Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు, లోకేష్‌ను జనాలు నమ్మటం లేదా..?

సరిగ్గా ఈ సమయంలో చంద్రబాబు, లోకేష్ ను జనాలు నమ్మటంలేదని, అధికారంలోకి రాలేరని పురందేశ్వరి చెప్పారు. అంటే ఆమె మాటల్లోనే టీడీపీ అధికారంలోకి రాదని అర్థ‌మైపోతోంది.

చంద్రబాబు, లోకేష్‌ను జనాలు నమ్మటం లేదా..?
X

ఈ మాట చెప్పింది జగన్మోహన్ రెడ్డో లేకపోతే వైసీపీ నేతలో కాదు. స్వయాన చంద్రబాబుకు దగ్గరి బంధువు, బీజేపీ మహిళా మోర్చా జాతీయ నేత దగ్గుబాటి పురందేశ్వరే. ప్రకాశం జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఆధినాయకత్వం మీద, లోకేష్ మీద నమ్మకం లేదని చెప్పారు. ఇక్కడ టీడీపీ ఆధినాయకత్వం అంటే చంద్రబాబు కాక మరొకరు లేరుకదా. తండ్రి, కొడుకులను జనాలు నమ్మటంలేదని పురందేశ్వరి తేల్చి చెప్పేశారు.

ఒకవైపు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ప్రజలంతా జగన్ పరిపాలనతో విసిగిపోయున్నారని, వైసీపీని ఓడించటానికి జనాలంతా కాచుక్కూర్చున్నట్లు చెబుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో కానీ, ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి అనే కార్యక్రమాల్లో జనాలు విపరీతంగా హాజరవుతున్నారని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. జనాలు ఇంతగా స్పందించటం తన రాజకీయ జీవితంలో చూడటం ఇదే మొదటిసారంటూ ప్రతిచోటా చెబుతున్నారు.

ఇక లోకేష్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనాలు విరగబడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. జగన్ రెడ్డి పని అయిపోయినట్లే అంటు ట్విట్టర్లో ఒకటే రచ్చ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అన్న ధైర్యంతోనే జనవరి 27వ తేదీ నుండి పాదయాత్రకు రెడీ అయిపోతున్నారు. కుప్పంలో మొదలయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించాలని ప్లాన్ చేశారు. 175 నియోజకవర్గాలను టచ్ చేసేలా 4 వేల కిలోమీటర్ల యాత్రకు సిద్ధమవుతున్నారు.

సరిగ్గా ఈ సమయంలో చంద్రబాబు, లోకేష్ ను జనాలు నమ్మటంలేదని, అధికారంలోకి రాలేరని పురందేశ్వరి చెప్పారు. అంటే ఆమె మాటల్లోనే టీడీపీ అధికారంలోకి రాదని అర్థ‌మైపోతోంది. ఇక ఎప్పుడు మొదలవుతుందో తెలీని మిత్రపక్షం అధినేత పవన్ కల్యాణ్‌ యాత్ర గురించి మాట్లాడుతూ జనసేనతో కలిసి యాత్రలో పాల్గొనే విషయాన్ని ఇంకా ఆలోచించలేదన్నారు. పవన్ తో కలవాలా లేకపోతే విడిగానే యాత్ర చేయాలా అన్నది తొందరలోనే డిసైడ్ అవుతుందన్నారు.

First Published:  9 Dec 2022 9:36 AM IST
Next Story