విశాఖ సీటు ఆశించా.. కానీ - జీవీఎల్ ఫస్ట్ రియాక్షన్
విశాఖపట్నం పార్లమెంట్ సీటు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఇక్కడి నుంచి బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యాసంస్థల ఛైర్మన్ భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.
విశాఖపట్నం పార్లమెంట్ సీటు దక్కకపోవడంపై స్పందించారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు. విశాఖపట్నంలో బీజేపీకి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో చాలా మంది కార్యకర్తలు, అభిమానులు కలత చెంది ఆవేదనతో తనకు ఫోన్లు చేస్తున్నారన్నారు. విశాఖ ప్రజల కోసం, నగర అభివృద్ధి కోసం గత మూడేళ్లుగా విశేష కృషిచేశానని, అందుకు తాను సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
విశాఖలో పోటీ చేసే అవకాశం రాకపోవడం నిజమేనన్న జీవీఎల్.. తాను చేసిన సేవ నిస్వార్థమైందన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను సేవ చేశానని చెప్పుకొచ్చారు. తన సేవ వృథా అయిపోయిందని ఎవరూ భావించొద్దన్నారు జీవీఎల్. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను సేవ చేయలేదన్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. త్వరలోనే విశాఖకు వచ్చి అందరిని కలిసి, చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
విశాఖపట్నం పార్లమెంట్ సీటు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఇక్కడి నుంచి బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యాసంస్థల ఛైర్మన్ భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గత మూడేళ్లుగా అక్కడ పని చేసుకుంటున్న జీవీఎల్‌కు నిరాశ తప్పలేదు. జీవీఎల్ ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వచ్చే నెలలో ఆయన పదవీకాలం ముగియనుంది.