చీరలు పంచితే రాద్ధాంతం చేస్తారా.. అధికారులపై నోరుపారేసుకున్న సీఎం రమేష్, అయ్యన్న
మహిళా మేలుకో పేరిట శనివారం నర్సీపట్నంలోని ఓ హోటల్లో కార్యక్రమం నిర్వహించారు. ఆ సమావేశానికి వచ్చిన మహిళలు, బీజేపీ కార్యకర్తలకు చీరలు, డబ్బులు పంచారు. ఈ విషయం తెలిసి అధికారులు వెళ్లి అడ్డుకుంటే సీఎం రమేష్ వారిపై రెచ్చిపోయారు.
అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ తన దురుసుతనంతో మరోమారు వార్తల్లోకి ఎక్కారు. మొన్న తన అనుచరుడైన టైల్స్ వ్యాపారి వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులను నెట్టేయడంతో సీఎం రమేష్‌పై కేసు నమోదయింది. ఆ ఘటన మరవకముందే తాజాగా నర్సీపట్నంలో మహిళలకు కమలం గుర్తు ఉన్న చీరలు, నగదు పంచుతూ దొరికిపోయారు. పైగా చీరలు పంచితే రాద్ధాంతం చేస్తారా అంటూ సీఎం రమేష్‌తోపాటు, నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు అధికారులపై విరుచుకుపడటం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.
మా గుర్తు ప్రచారం చేసుకుంటే తప్పా?
మహిళా మేలుకో పేరిట శనివారం నర్సీపట్నంలోని ఓ హోటల్లో కార్యక్రమం నిర్వహించారు. ఆ సమావేశానికి వచ్చిన మహిళలు, బీజేపీ కార్యకర్తలకు చీరలు, డబ్బులు పంచారు. ఈ విషయం తెలిసి అధికారులు వెళ్లి అడ్డుకుంటే సీఎం రమేష్ వారిపై రెచ్చిపోయారు. మా గుర్తు కమలం అని ప్రచారం చేసుకోవడంలో భాగంగానే చీరలు పంచామని సీఎం రమేష్ ఎదురుదాడికి దిగారు. డబ్బులు పంచలేదని బుకాయించారు. అయితే బీజేపీ నేతలు, సీఎం రమేష్ అనుచరులు డబ్బులు పంచుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
డీజీపీ, సీఎస్ పనికిమాలిన వెధవలని నోరుపారేసుకున్న అయ్యన్న
చీరలు పంచితే రాద్ధాంతం చేస్తారా అంటూ నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి, సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. డీజీపీ, సీఎస్ పనికిమాలిన వెధవంలంటూ నోరు పారేసుకున్నారు. వాళ్లిద్దరినీ మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి చీరలు పంచామని ఒప్పుకోవడమే కాకుండా అడ్డుకున్న అధికారులను, డీజీపీ, సీఎస్‌లను నోటికొచ్చినట్లు తిట్టడంతో అయ్యన్న తీరుపై జనం విస్తుపోతున్నారు.