పవన్‌తో లంగోటా ఫైట్‌కు సిద్ధం
రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ నాలుగు జిల్లాలను విడగొట్టి.. రెండు జిల్లాలను తెలంగాణలో, రెండు జిల్లాలను ఆంధ్రాలో కలపాలన్న ప్రయత్నాలు జరిగినప్పుడు ఇదే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ అంటూ ఏ నాయకుడైనా మాట్లాడితే తాట తీస్తా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాయలసీమకు చెందిన బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
తన పేరు తీసి, తాట తీస్తా అని చెప్పడానికి పవన్‌కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తనని ముసలోడు అన్నాడని, కొండారెడ్డి బురుజు వద్ద పవన్‌తో కుస్తీ ఫైట్ కు తాను సిద్ధమని బైరెడ్డి ఆహ్వానించారు. ఎవరు ఎవరి తాటతీస్తారో! ఎవరు ఎవరిని తొక్కుతారో తేలాలంటే పవన్ కల్యాణ్ లంగోటా కట్టుకొని రావాలని, తాను వస్తానని కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ప్రజల సమక్షంలోనే కుస్తీ ఫైట్ చేద్దామని సవాల్ చేశారు. నువ్వు నన్ను తొక్కుతావో.. లేక నేనే నిన్ను కిందేసి తొక్కుతానో అక్కడే తేలుతుందన్నారు. తాట తీయడం అంటే ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే, ఎవడో మేకప్ వేస్తే, ఎవడో తల దువ్వి పంపిస్తే బయటకు వచ్చి డైలాగులు చెప్పడంకాదన్నారు.
రాయలసీమ వారిని అవమానించడం పవన్‌కు అలవాటుగా మారిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ నాలుగు జిల్లాలను విడగొట్టి.. రెండు జిల్లాలను తెలంగాణలో, రెండు జిల్లాలను ఆంధ్రాలో కలపాలన్న ప్రయత్నాలు జరిగినప్పుడు ఇదే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అన్యాయం, నయవంచన జరిగినప్పుడు ఏ ప్రాంతంలోనైనా విభజన డిమాండ్ వస్తుందని, దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదన్నారు.
ప్రత్యేక రాష్ట్రాలు డిమాండ్లు వస్తే తాట తీస్తా అని చెప్పడానికి ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా అని పవన్ ను ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు తమ డిమాండ్ల కోసం గళమెత్తిన నాడు లక్ష మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా ఏమి చేయలేరన్నారు. కర్నూలుని రాజధానిగా చూడాలని తనకు ఉందని చెప్పిన పవన్ కల్యాణ్.. మరి రాయలసీమకు రాజధాని విషయంలో అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కరువు పరిస్థితులపై పాదయాత్ర చేస్తానని రెండుసార్లు ప్రకటించిన పవన్.. ఇప్పటికీ ఎందుకు ఆ పని చేయలేకపోయారని బైరెడ్డి ప్రశ్నించారు.
సిద్దేశ్వరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి కట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని.. రాయలసీమ ప్రజలకు కావాల్సింది.. ఐకానిక్ బ్రిడ్జి కాదు, బ్రిడ్జ్ కం బ్యారేజ్ అని తాము డిమాండ్ చేస్తున్నామని ఆ అంశంపై 28న చలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని తాము నిర్వహించబోతున్నామని, మరి ఈ అంశంపై పవన్ స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా పవన్ తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. ఆ ప్రాంతం కూడా అన్యాయానికి గురవుతోందని.. అక్కడ కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చేందుకు అవకాశం ఉందన్నారు.