జగన్ ఇటు వస్తే నేను రెడీ -ఆదినారాయణ రెడ్డి
దేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఏపీలో మాత్రం భారతి రాజ్యాంగం నడుస్తోందన్నారు. 151 సీట్లున్న వైసీపీ వచ్చే ఎన్నికల తర్వాత 15 సీట్లకు పరిమితం అవుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి కాకుండా జమ్మలమడుగు నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రచారం కొద్ది రోజుల క్రితం నడిచింది. ఈ ప్రచారంపై స్పందించిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. జగన్ జమ్మలమడుగు వచ్చి పోటీ చేయాలన్నారు. జగన్ జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తే ఆయనపై తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జమ్మలమడుగులో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆదినారాయణరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
మూడేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారని.. జగన్‌ను ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైసీపీని ఓడించేందుకు వీలైతే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తామన్నారు. దేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఏపీలో మాత్రం భారతి రాజ్యాంగం నడుస్తోందన్నారు. 151 సీట్లున్న వైసీపీ వచ్చే ఎన్నికల తర్వాత 15 సీట్లకు పరిమితం అవుతుందన్నారు.
తనకు సంబంధం లేకపోయినా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన పేరును ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందారని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. వివేకాను హత్య చేసింది ఎవరో ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయిందన్నారు. కడప జిల్లాలో మూడేళ్ల క్రితం ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన జగన్ ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేశారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.