ఏపీలో బీజేపీ ఎక్కడుందో తెలియదంటోన్న బీజేపీ కీలక నేత
కన్నా, రావెల వంటి వారి బాటలో మరికొందరు పార్టీని వీడుతారని వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ సంక్షోభ సమయంలో మరో కీలక నేత బీజేపీ ఉనికిపైనే సందేహాలు వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఎక్కడుందో ఆ పార్టీ కీలక నేతకే తెలియదట. ఎనిమిది శాతం ఓటింగ్ 0.5 శాతానికి పడిపోయిందని, ఇప్పుడు అది కూడా ఉందో లేదోనని చెప్పి కమలం పార్టీలో బాంబు పేల్చారు. ఇటీవలే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి సైకిల్ ఎక్కారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీలో కీలక నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ గా అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. కన్నా వర్గంగా భావించే కొందరు బీజేపీ నేతలు పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్‌ని ఢిల్లీలో కలిసి సోము వీర్రాజుపై అసమ్మతి స్వరం వినిపించారు.
బీజేపీ పెద్దల ఆదేశాలతో ఏపీకి వచ్చిన మురళీధరన్ కి ఇక్కడా పరస్పర ఫిర్యాదుల పర్వమే ఎదురైంది. రాజమహేంద్రవరం వచ్చిన ఇన్చార్జిని పార్టీ అధ్యక్షుడైన సోము వీర్రాజు కలవలేదు. ఎందరు ఎన్ని ఆరోపణలు చేసినా కమలనాథుల అనుగ్రహం వీర్రాజుకే ఉంటుందనే ఆగ్రహంతో ఇక పార్టీలో ఉండి లాభం లేదనుకుని ఒక్కొక్కరూ పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. టిడిపి నుంచి బీజేపీలో చేరిన నేతలు మౌనంగా వుంటున్నారే కానీ, పార్టీ వీడటంలేదు. కన్నా, రావెల వంటి వారి బాటలో మరికొందరు పార్టీని వీడుతారని వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ సంక్షోభ సమయంలో మరో కీలక నేత బీజేపీ ఉనికిపైనే సందేహాలు వ్యక్తం చేశారు.
టిడిపి నుంచి బీజేపీలో చేరిన జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి ఓ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గతంలో బీజేపీకి 8 శాతం ఓటింగ్ వరకూ వెళ్లిందని, 2019 ఎన్నికల్లో 0.5 శాతానికి పడిపోయిందని, ఇప్పుడా 0.5 శాతం ఉందో లేదో కూడా చెప్పలేమని ప్రకటించి కలకలం రేపారు. బీజేపీలో చాలా సీనియర్ అయిన పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన మాట వినే పరిస్థితిలో లేడని ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయనుకుంటున్నామని, కానీ అలా జరిగే అవకాశం కనపడటంలేదన్నారు. పవన్‌ను నాయకుడిగా ఉంచి మిగిలినవాళ్లను కలుపుకొని ముందుకు పోవాలన్నది ప్రధాని ఆలోచన అని చెప్పిన ఆదినారాయణరెడ్డి, ఏపీలో బీజేపీ ఉనికిలో లేదని చెప్పి గాలి తీసేశారు.