బాబు-పవన్ భేటీపై బీజేపీ హైకమాండ్ సూచనలు
వైసీపీపై పోరాటానికి బీజేపీ కలిసి రాలేదంటూ కారణాన్ని బీజేపీపై నెట్టేసే ప్రయత్నాలపై బీజేపీ పెద్దలు అప్రమత్తయ్యారు. అందుకే చంద్రబాబు, పవన్ భేటీపై సీరియస్‌గా స్పందించవద్దని ఏపీ బీజేపీ నేతలకు సూచించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ తర్వాత పరిణామాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. బీజేపీతో కలిసి పోరాటం చేసేందుకు మనసు రావడం లేదంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం, ఆ వెంటనే చంద్రబాబు వచ్చి కలిసిన నేపథ్యంలో పార్టీ స్టాండ్‌పై బీజేపీ పెద్దలతో సోమువీర్రాజు మాట్లాడారు. బీజేపీకి తాను ఊడిగం చేయబోనని పవన్ చెప్పిన అంశాలను బీజేపీ పెద్దలకు వివరించారు.
వైసీపీపై పోరాటానికి బీజేపీ కలిసి రాలేదంటూ కారణాన్ని బీజేపీపై నెట్టేసే ప్రయత్నాలపై బీజేపీ పెద్దలు అప్రమత్తయ్యారు. అందుకే చంద్రబాబు, పవన్ భేటీపై సీరియస్‌గా స్పందించవద్దని ఏపీ బీజేపీ నేతలకు సూచించారు. చంద్రబాబు కలవడాన్ని ఒక పరామర్శగా మాత్రమే చూడాలని బీజేపీ భావిస్తోంది. అయితే పొత్తుల విషయంలో మాత్రం ఒక్క జనసేనతోనే బీజేపీ స్నేహం ఉంటుందని బీజేపీ హైకమాండ్ స్పష్టత ఇచ్చింది. వైసీపీ, టీడీపీకి సమదూరం పాటించడమే పార్టీ లైన్ అని స్పష్టం చేశారు. రాజకీయంగా పవన్‌తో స్నేహం కొనసాగుతుందనే భావించాలని ఏపీ నేతలను సూచించింది హైకమాండ్.
పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ గ్యాప్ తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మాత్రమే చెప్పింది. అంతకు మించి నిన్న భేటీతో పవన్ కల్యాణ్ బీజేపీకి దూరం అయ్యారన్న ప్రచారానికి అవకాశం ఇవ్వొద్దని హైకమాండ్ సోమువీర్రాజుకు సూచించినట్టు చెబుతున్నారు.