కాంగ్రెస్ పై విజయసాయి ట్వీట్లతో బీజేపీ హ్యాపీ..
కాంగ్రెస్ ని తిట్టే క్రమంలో భారత్ విచ్ఛిన్నం కాలేదంటూ విజయసాయిరెడ్డి బీజేపీకి సర్టిఫికెట్ ఇచ్చినట్టయింది. దీంతో సహజంగానే బీజేపీ సంబరపడుతోంది.
బీజేపీ, వైసీపీ మధ్య స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, శత్రుత్వం అయితే లేదు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీని వైసీపీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, విమర్శించలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించడంతో పాటు.. కేంద్రం తీసుకొచ్చే బిల్లుల విషయంలో ఎప్పుడూ వైసీపీ నుంచి ఇబ్బంది లేదు. ఇక రాష్ట్రంలోకొస్తే.. బీజేపీ నుంచి అప్పుడప్పుడూ వైసీపీపై ఘాటు విమర్శలు వినపడుతుంటాయి. కానీ బీజేపీని ఎక్కడా వైసీపీ లెక్కలోకి తీసుకోలేదు. వారి విమర్శలన్నీ టీడీపీ, జనసేన చుట్టూనే ఉంటాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు తావిచ్చింది.
జోడోయాత్ర కాదు.. తుది శ్వాస..
భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ''ఈ పాదయాత్ర విషయంలో కాంగ్రెస్ కు నేనిచ్చే సలహా ఒకటే.. భారత్ జోడో యాత్రకి బదులు, 'మృత్యువుకు ముందు తుదిశ్వాస' అని ఈ యాత్రకి పేరు మార్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం'' అంటూ ట్వీట్ చేసారు విజయసాయిరెడ్డి.
భారత్ విచ్ఛిన్నం కాలేదు, కాదు కూడా..
కాంగ్రెస్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేదిగా ఉందని అన్నారు విజయసాయిరెడ్డి. నెహ్రూ కుటుంబం ఎన్నికల్లో గెలవలేనంత మాత్రాన భారత్ విచ్ఛిన్నమైందని కాదని.. భారత్ ఎప్పుడూ విచ్ఛిన్నం కాలేదని, ఇకపై కూడా విచ్ఛిన్నం కాబోదని అన్నారు. కాంగ్రెస్ ని తిట్టే క్రమంలో భారత్ విచ్ఛిన్నం కాలేదంటూ విజయసాయిరెడ్డి బీజేపీకి సర్టిఫికెట్ ఇచ్చినట్టయింది. దీంతో సహజంగానే బీజేపీ సంబరపడుతోంది. ఏపీలో పొలిటికల్ సీన్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. వైసీపీకి బీజేపీ అవసరం అస్సలు లేదు కానీ, బీజేపీకి మాత్రం ఏపీలో ఏదో ఒక పార్టీతో అంటకాగడం అత్యవసరం. ప్రస్తుతానికి జనసేనతో స్నేహం చేస్తున్న కాషాయదళం ఎప్పుడు ఎటువైపు అడుగు వేస్తుందో చూడాలి. వైసీపీనుంచి వస్తున్న పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యూహాత్మకమా, లేక కాంగ్రెస్ ని తిట్టే క్రమంలో అనుకోకుండా వినిపించిన పొగడ్తలా అనేవి తేలాల్సి ఉంది.