వైసీపీ ప్రభుత్వ పథకాన్ని కొనియాడిన బీజేపీ సర్కార్
ఇదేమీ తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు.. తెలివైన నిర్ణయం. ఎందుకంటే.. ఈ ఫొటోలు పెట్టిన తర్వాత నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.
ఏపీలో వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా కూటమితో జట్టు కట్టిన బీజేపీ.. ఏపీ అమలు చేస్తున్న పథకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తూచా తప్పకుండా అమలు చేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ఆ పథకం బాగుందని స్పష్టం చేసింది. విషయం చిన్నదే అయినా.. పెద్ద ఫలితాన్ని ఇస్తుండడంతో వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొనియాడింది.
ఇంతకీ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం దేనిపై అంటే.. ఆర్టీసీ బస్సుల ద్వారా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడంపై. దీనికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న చిన్న ఆలోచన పెద్ద ఫలితాన్ని ఇస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. అది.. డ్రైవర్ సీటు ముందు భాగంలో వారి కుటుంబ సభ్యుల ఫొటోలను, గ్రూప్ ఫొటోలను అతికించడం. డ్రైవర్ బస్సును ఇష్టారీతిన డ్రైవ్ చేసే ముందు.. మీకో కుటుంబం ఉంది.. జాగ్రత్త! అని హెచ్చరించడమే దీని ఉద్దేశం.
అయితే ఇదేమీ తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు.. తెలివైన నిర్ణయం. ఎందుకంటే.. ఈ ఫొటోలు పెట్టిన తర్వాత నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఆ విషయాన్ని రికార్డులే వెల్లడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న ఈ నిర్ణయం గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. 2023 జనవరిలో ఈ నిర్ణయం తీసుకోగా ఈ ఏడాది జనవరి నాటికి 5 శాతం మేరకు ప్రమాదాలు తగ్గాయి. దీనికితోడు.. బస్సులు కూడా రిపేర్లకు రాకుండా ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న యూపీలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా ఏపీలో పర్యటించింది.
ఏపీ ఆర్టీసీ అధికారులతో భేటీ అయినా బీజేపీ ప్రభుత్వం మీ ఆలోచనను మేం కూడా పంచుకుంటాం అని చెప్పింది. ఇదే ఐడియాను యూపీలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని యూపీ రవాణా శాఖ కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ వెల్లడించారు. ‘ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం బాగుంది. ప్రమాదాలు తగ్గాయి. మేం కూడా దీనిని పాటిస్తాం‘ అని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. ఏపీలో జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థను కూడా యూపీ ప్రభుత్వం 2022 నుంచి అనుసరిస్తుండటం గమనార్హం. ఇక వలంటీర్ వ్యవస్థను హరియాణా ప్రభుత్వం అమలు చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఇంటింటికీ పింఛన్లు అందిస్తుండటం గమనార్హం.